Begin typing your search above and press return to search.

రెమ్ డెసివిర్ డ్రగ్ ఉత్పత్తి 3రెట్లు పెంపు .. 7 సంస్థలకి కేంద్రం అనుమతి !

By:  Tupaki Desk   |   18 May 2021 11:30 AM GMT
రెమ్ డెసివిర్ డ్రగ్ ఉత్పత్తి 3రెట్లు పెంపు .. 7 సంస్థలకి కేంద్రం అనుమతి !
X
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అలాగే దేశంలో నమోదు అయ్యే మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా ను అరికట్టే వ్యాక్సిన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా టీకాల సరఫరాను పెంచేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాలు టీకాలు వృథా కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అత్యున్నత ప్రమాణాలను పాటిస్తే వ్యాక్సిన్ వృథాను అరికట్టొచ్చని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కార్యక్రమాల కోసం మనం చేసే ప్రయత్నాల్లో లోపాలుండకూడదని చెప్పారు.

అలాగే, రెమ్ డెసివిర్ డ్రగ్ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వైల్స్ నుండి 1.19 కోట్ల వైల్స్ కి పెంచుతున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండియాలో గిలీడ్ లైఫ్ సైన్సెస్ ఇచ్చిన వాలంటరీ లైసెన్స్ కింద ఈ మందు ఉత్పత్తి అవుతోంది. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెటిరో, జుబిలియెంట్ ఫార్మా, మైలాన్, సీంజీన్, జైడస్, కేడిలా కంపెనీలు ఈ మెడిసిన్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశీయంగా దీని ప్రొడక్షన్ కెపాసిటీని పెంచడానికి అనువుగా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఈ మంత్రిత్వ శాఖ వీటిని కోరింది. ఈ సంస్థలతో బాటు కేంద్ర సమన్వయ కృషితో ఇక నెలకు దాదాపు 119 లక్షల వైల్స్ ఉత్పత్తి అవుతాయని ఈ శాఖ వివరించింది. ఇప్పటికే ఈ సంస్థలతో ఈమేరకు సంప్రదింపులు జరిగినట్టు తెలిపింది.

దేశంలో ఇప్పటికే 38 అదనపు కేంద్రాలకు ఈ మెడిసిన్ అమ్మకాల విషయంలో అనుమతి లభించగా 22 సైట్ల సంఖ్యను 60 సైట్లకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. తద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మందు అందుబాటులో ఉండగలదని ఆశిస్తున్నట్టు పేర్కొంది. కరోనా కట్టడిపై అన్ని రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో ఇవ్వాళ ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో పోరులో అధికారులే ఫీల్డ్ కమాండర్లని ప్రధాని అన్నారు. మహమ్మారి సమయంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు.. భవిష్యత్ లో మరిన్ని క్లిష్టమైన సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడతాయన్నారు.