Begin typing your search above and press return to search.

షిరిడి సాయికి గండమొచ్చింది!!

By:  Tupaki Desk   |   20 Jan 2015 8:55 AM GMT
షిరిడి సాయికి గండమొచ్చింది!!
X
హిందూ ఆలయాల్లో షిరిడి సాయి బొమ్మలకు గండం వచ్చి పడింది. హిందూ సాధువులు, పీఠాధిపతులతో కూడిన బృహత్‌ సమావేశం ధర్మసంసద్‌... షిరిడి సాయిని హిందూ ఆలయాల్లో ఆరాధించడానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసింది. ఆ ప్రకారం.. అన్ని హిందూ ఆలయాల్లోనూ షిరిడి సాయి బొమ్మలుగానీ, విగ్రహాలు గానీ ఉండకుండా చూడాలని, ఉంటే తొలగించాలని తీర్మానించారు. హిందువుల్లోనూ దేశవ్యాప్తంగా సాయి భక్తులు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి హిందూ పీఠాధిపతుల నిర్ణయం చాలా మందికి ఆగ్రహం కలిగించే మాట వాస్తవమే గానీ... షిరిడిసాయి దేవుడు గానీ.. ఆధ్యాత్మిక గురువు గానీ కాదని.. అలాంటి వ్యక్తి ప్రతిమను హిందూ ఆలయాల్లో ఉంచి ఆరాధించడం తగదని విశ్లేషించడం విశేషం.

షిరిడి సాయి ని ఆరాధించే వాళ్లు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నప్పటికీ.. ఆయనకు సంబంధించి వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. ఆయన ముస్లిం ఫకీరు అని వాదించే వారు అనేకులున్నారు. ఆయన హిందూ-ముస్లిం ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక అని చెప్పే వారున్నారు. ఆయన ముస్లిం ఫకీరు అన్న వాదన చాలా విస్తృతంగా ఉండగా... సాయిబాబాను హిందూ దేవుడిగా మార్చేస్తూ.. ఆయన నుదుట కుంకుమ బొట్లు, విభూది పట్టీలు పెట్టేసి.. భక్తుల్లో ఎవరికి తోచిన విధంగా వారు ఆయన మూర్తిని తయారుచేసుకుని, ఫోటోలు డిజైన్‌ చేయించుకుని పూజించుకోవడం జరుగుతోంది. సాయి ముస్లిం ఫకీరు అయితే.. హిందూ భక్తులు ఆయనను హైజాక్‌ చేసేశారనే వాదన కూడా ఒకటి ఉంది.

హిందువులు సహజంగానే మెజారిటీ గనుక.. వారు పూజించే విధానమే ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చేస్తుంది. పైగా హిందూ ఆలయాల్లో కూడా వారు సాయిబాబా ఫోటోలను కూడా పెట్టేస్తున్నారు. చాలా చోట్ల.. సాయి బాబా విగ్రహాలను కూడా హిందూ ఆలయ ప్రాంగణాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వాటిని తొలగించాల్సిందిగా ధర్మసంసద్‌ చెప్పడం విశేషం. ఉత్తరప్రదేశ్‌ అలహాబాద్‌ సమీపంలోని ద్వారక శంకరాచార్య శిబిరంలో ఈ పీఠాధిపతుల సంసద్‌ జరిగింది. ద్వారక స్వామి స్వరూపానంద సరస్వతి, పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు. హిందువులు మతం మారకుండా నిబంధనలు పెంచడం గురించి, సంస్కృతాన్ని ప్రోత్సహించడం గురించి, పీకే సినిమాను నిషేధించడం గురించి... అయోధ్యలో రామమందిరం గురించి కూడా వీరు అనేక తీర్మానాలు చేశారు. మరి ఈ సాధువుల తీర్మానాలను ప్రభుత్వం ఎలా పరిగణిస్తందో, గుర్తిస్తుందో చూడాలి.