Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పబ్ తన కూతురిదేనన్న ప్రచారంపై స్పందించిన రేణుకా చౌదరి

By:  Tupaki Desk   |   4 April 2022 4:54 AM GMT
హైదరాబాద్ పబ్ తన కూతురిదేనన్న ప్రచారంపై స్పందించిన రేణుకా చౌదరి
X
హైదరాబాద్ లో బయటపడిన భారీ రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఉన్నట్టు చెబుతున్నారు. ఫండింగ్ మింక్ అనే పబ్ పై జరిపిన ఈ దాడిలో పార్టీలో డ్రగ్స్ వాడినట్లు అక్కడ ఆధారాలు లభించాయి.

ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో డ్రగ్స్ తీసుకున్న వారు మాత్రమే ఉన్నారు. మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక,రాహుల్ సిప్లిగంజ్ సహా ప్రముఖులు ఉన్నారు. వీరిని విచారించి పంపించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఈ పబ్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూతురుది అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారంపై వివరణ ఇచ్చారు. 'ఆ పబ్ కు నా కూతురు తేజస్విని యజమాని కాదు.. ఆ పబ్తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు.

మా అమ్మాయిని ఎవరూ అరెస్ట్ చేయలేదు. మీడియా సంస్థలు విలువలు పాటించారు. వార్తలు ప్రసారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి' అని రేణుకా చౌదరి అన్నారు.

పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని.. విచారించారని కూడా ప్రచారం చేశారు. దీంట్లో ఒక్కటి కూడా నిజం కాదని రేణుకా చౌదరి తెలిపారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కు మా అమ్మాయి తేజస్విని యజమాని కాదు.. అసలు ఈ పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు.

ఇక ఏప్రిల్ 2న మా అమ్మాయి తేజస్విని పబ్ పై పోలీసులు దాడి చేసినప్పుడు అందులో లేదని తెలిపారు. అలాంటప్పుడు ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం.. ప్రశ్నించడం జరగని పని అని.. ఈ సందర్భంగా నేను మీడియా సంస్థలను 'వార్తలు ప్రసారం చేసేముందు నిర్ధారించుకోవాలని' రేణుక విజ్ఞప్తి చేశారు. మీ సంచలనాత్మక కథనాల కోసం ప్రైవేటు వ్యక్తల పేర్లను బయటకు లాగే ప్రయత్నం చేయవద్దని రేణుకా చౌదరి హితవు పలికారు.