Begin typing your search above and press return to search.

క‌మ్మ టార్గెట్‌గా.. సీఎం జ‌గ‌న్‌పై రేణుకా చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

By:  Tupaki Desk   |   15 April 2022 1:41 PM GMT
క‌మ్మ టార్గెట్‌గా.. సీఎం జ‌గ‌న్‌పై రేణుకా చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
X
తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కురాలు, ఖ‌మ్మం మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా, వైసీపీ స‌ర్కారు పైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నిజానికి గ‌తంలోనూ.. చంద్ర‌బాబు స‌తీమ‌ణిని అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు.. కొంద‌రు దూషించారంటూ.. ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్న స‌మ‌యంలోనూ రేణుకా చౌద‌రి.. తీవ్ర‌స్థాయిలో మండి ప‌డ్డారు. మ‌రోసారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే.. `చెప్పుతో కొడ‌దా బ‌ద్మాష్‌` అంటూ ఫైర‌య్యారు. మ‌ళ్లీ తాజాగా.. ఆమె క‌మ్మ సామాజిక వ‌ర్గం సెంట్రిక్‌గా సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు.

తాజాగా జ‌రిగిన కమ్మ సామాజికవర్గ సమ్మేళనంలో రేణుకా చౌద‌రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ రాజ‌ధాని అమరావతిని నాశ‌నం చేస్తున్నార‌ని పేర్కొంటూనే క‌మ్మ సామాజిక వ‌ర్గం విష‌యంలో సీఎం జగన్ వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. నిజమాబాద్ లో నిర్వహించి కమ్మ సమ్మేళనంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకాచౌదరి సహా పలువురు ఆ సామాజిక వ‌ర్గం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తోందంటూ.. రేణుక తప్పుబట్టారు. ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

అమరావతిని కమ్మరావతిగా హేళన చేస్తున్న ఏపీ సీఎం జగన్.. చేతనైతే రాజధానికి `కమ్మరావతి`గా పేరు పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలన్నారు. అమరావతి కమ్మ రాజధానిగా పేర్కొంటూ జగన్ తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని రేణుక తీవ్రంగా తప్పుబట్టారు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గం మంచితనాన్ని బలహీనతగా చూడకండని సీఎం జగన్ కు రేణుక చురకలు అంటించారు. రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమేనన్నారు.

ఏపీలో వైసీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ ను, టీడీపీని వైసీపీ సర్కార్ టార్గెట్ చేయడంపై ఆయా నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా అమరావతిని కమ్మరావతిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రేణుకాచౌదరి వంటి కమ్మ సామాజిక వర్గ నేతలకు ఇతర నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రేణుక సీఎం జగన్ ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. మ‌రి దీనికి వైసీపీ నాయ‌కులు ఎలాంటి రియాక్ష‌న్ ఇస్తారో చూడాలి.