Begin typing your search above and press return to search.

మోడీకి చురుకు పుట్టేలా వార‌సులపై విమ‌ర్శ‌లు

By:  Tupaki Desk   |   1 May 2018 5:09 AM GMT
మోడీకి చురుకు పుట్టేలా వార‌సులపై విమ‌ర్శ‌లు
X
మోడీకి కొత్త త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. ఆ మ‌ధ్య వ‌ర‌కు ఆయ‌న ఎంపిక చేసిన ముఖ్య‌మంత్రులు ఆయ‌న‌కు ఎంతోకొంత మంచిపేరును తెచ్చి పెట్ట‌టంతోపాటు.. బీజేపీ మైలేజీ పెంచార‌ని చెప్పాలి. ఇందుకు భిన్నంగా ఇటీవ‌ల నియ‌మించిన ముఖ్య‌మంత్రులు మోడీకి కొత్త క‌ష్టాల్ని తెచ్చి పెడుతున్నారు.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తూ.. నిత్యం వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తున్న వారి తీరు మోడీకి ఇబ్బందిక‌రంగా మారుతోంది. మోడీని తెగ ఇబ్బంది పెట్టేస్తున్న సీఎంల‌లో ఒక‌రు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ అయితే మ‌రొక‌రు త్రిపుర సీఎం బిప్ల‌వ్ కుమార్ (విప్ల‌వ్ కుమార్‌).

వీరిద్ద‌రూ చేస్తున్న వ్యాఖ్య‌లు రాజ‌కీయ క‌ల‌క‌లాన్ని సృష్టించ‌ట‌మే కాదు.. వీటిపై స్పందించేందుకు బీజేపీ నేత‌ల‌కు చిరాకు పుట్టిస్తుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి.. ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రి బీజేపీ ముఖ్య‌మంత్రుల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జమెత్తారు. విజ‌య్ రూపానీ.. బిప్ల‌వ్ కుమార్ లు చేస్తున్న వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావిస్తూ.. మోడీ వార‌సులు ఇలా ఉంటారా? వీళ్లేం ముఖ్య‌మంత్రులంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒకాయ‌న గూగుల్ని నార‌దుడితో పోలుస్తూ వ్యాఖ్య‌లు చేస్తారంటూ విజ‌య్ రూపానీని ఉద్దేశించి మండిప‌డిన రేణుక‌.. త్రిపుర సీఎం బిప్ల‌వ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంకొక‌రేమో మ‌హాభార‌త కాలంలో ఇంట‌ర్నెట్ ఉందంటార‌న్నారు. ఆయ‌న అక్క‌డితో ఆగ‌లేద‌ని.. యువ‌కులు ఉద్యోగాలేం చేస్తారు.. ఏం చ‌క్కా పాన్ షాపులు పెట్టుకొని బ‌త‌కాల‌ని స‌ల‌హా ఇవ్వ‌టం ఏమిటంటూ మండిప‌డ్డారు. ఒక‌సారి అందాల పోటీల మీదా.. మ‌రొసారి సాటి ముఖ్య‌మంత్రుల మీదా వారు చేస్తున్న వ్యాఖ్య‌లు వింటుంటే.. వీళ్లా ప్ర‌జ‌ల్ని పాలించేది? అన్న సందేహం త‌న‌కు క‌లుగుతుంద‌ని రేణుక ఫైర్ అయ్యారు.

ఓప‌క్క బిప్ల‌వ్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోడీ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. ఆయ‌న్ను త‌న‌ను క‌ల‌వాలంటూ అల్టిమేటం జారీ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై స‌ద‌రు సీఎం స్పందిస్తూ.. మోడీతో భేటీ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు. అంద‌రూ అనుకున్న‌ట్లుగా మోడీతో భేటీ జ‌ర‌గ‌ద‌ని.. తాను గ‌తంలోనే ప్ర‌ధానిని క‌ల‌వాల‌ని కోరార‌ని.. ఇప్పుడు డేట్ ఫిక్స్ అయ్యింద‌న్నారు. ఈ మాట‌ల్లో నిజం ఎంత‌న్న‌ది మోడీతో త్రిపుర సీఎం భేటీ అనంత‌రం బ‌య‌ట‌కు రాక మాన‌దు. కాకుంటే.. అప్ప‌టివ‌ర‌కూ కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది.