Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ పున‌ర్వ్యస్థీక‌ర‌ణ‌.. ముహూర్తం అదేనా?

By:  Tupaki Desk   |   6 March 2020 6:56 AM GMT
జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ పున‌ర్వ్యస్థీక‌ర‌ణ‌.. ముహూర్తం అదేనా?
X
త‌న మంత్రి వ‌ర్గ స‌భ్యులంద‌రికీ రెండున్న‌రేళ్ల వ‌ర‌కూ టికెట్ ఉన్న‌ట్టే ఇది వ‌ర‌కూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. కేబినెట్ ను ఏర్పాటు చేసిన‌ప్పుడే.. రెండున్న‌రేళ్ల పాటు వాళ్లకు మంత్రి ప‌ద‌వులు ఉంటాయ‌ని, రెండున్నరేళ్లు మాత్ర‌మే ప‌ద‌వులు ఉంటాయ‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. అధికార కాలం స‌గం పూర్త‌వుతున్న‌ప్పుడు పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని, 90 శాతం మంది స్థానంలో కొత్త వాళ్లు వ‌స్తార‌ని జ‌గ‌న్ అప్పుడు అన్నారు.

అయితే ఆ లోపే ఇద్ద‌రు మంత్రులు ప‌ద‌వులు కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. మండ‌లి ర‌ద్దుతో, ఎమ్మెల్సీలుగా మంత్రులు అయిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ లు ప‌ద‌వుల‌ను కోల్పోవ‌డం ఖాయ‌మైంది. మండ‌లి ర‌ద్దుకు ఢిల్లీలో ఆమోదం పొందిన త‌ర్వాత వీరు రాజీనామా చేయ‌డం ఖాయ‌మైన‌ట్టే.

అలాగే స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంత్రి వ‌ర్గ స‌హ‌చరుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఏ మంత్రి జిల్లాలో స్థానిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ఫ‌లితాల‌ను సాధించ‌దో వారు రాజీనామాల‌కు రెడీగా ఉండాల‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. గ‌తంతో వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ఇదే సంప్ర‌దాయాన్ని పాటించారు. అప్ప‌ట్లో జ‌డ్పీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి బాధ్య‌త‌గా ఇద్ద‌రు మంత్రులు రాజీనామా చేశారు.

ఇప్పుడు కూడా అలాంటి బాధ్య‌త‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని మంత్రుల‌కు జ‌గన్ స్ప‌ష్టం చేశారు. పార్టీని గెలిపించ‌డ‌మా లేక మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డ‌మా అనే ప‌రిస్థితి ఉంటుంద‌ని తేల్చారు. ఈ నేప‌థ్యం లో ఏ ఒక‌రిద్ద‌రో రాజీనామాలు ఉంటాయేమో అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి!

మ‌రి అదే జ‌రిగితే.. ఖాళీ అవుతున్న రెండు ప‌ద‌వులు, ఎవ‌రైనా రాజీనామా చేస్తే అవి.. అలా మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంద‌నే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. అందుకు ఏప్రిల్ ముహూర్తం అనే టాక్ కూడా వినిపిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. మార్చి నెలాఖ‌రుక‌ల్లా స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ లో మంత్రి వ‌ర్గం లో మార్పు చేర్పులు ఉంటాయ‌నే చ‌ర్చ మొద‌లైంది. మ‌రి మంత్రి వ‌ర్గాన్ని జ‌గ‌న్ క‌దిలిస్తే.. ఆ ప‌ద‌వుల కోసం చాలా మంది ఆశావ‌హులు క్యూలో ఉన్నారు. వారి జాబితా కూడా పెద్ద‌దే!