Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో మ‌ళ్లీ ఆ పాత క‌థే రిపీట్!

By:  Tupaki Desk   |   15 Sep 2022 7:30 AM GMT
ఏపీ అసెంబ్లీలో మ‌ళ్లీ ఆ పాత క‌థే రిపీట్!
X
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబ‌ర్ 15 గురువారం ఉదయం ప్రారంభమైనప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్ష స‌భ్యుల నినాదాల‌తో హోరెత్తింద‌ని స‌మాచారం. గ‌తంలో మాదిరిగానే ప్ర‌శాంతంగా స‌భ స‌మావేశాలు జ‌రిగే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. శాస‌న‌స‌భ స‌మావేశ‌మయ్యాక ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఎమ్మెల్యేల‌కు స‌భ్యులంతా సంతాపం తెలిపారు. ఆ త‌ర్వాత‌ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉద్యోగ క్యాలెండర్‌పై చర్చకు డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ స‌భ్యులు తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌గా దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. 'ఉద్యోగం రావాలంటే.. జగన్ పోవాలి' అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో నిర‌స‌న‌ల మ‌ధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు.

సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంద‌ని.. ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యుల ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ సభ్యుల ఆందోళన చేస్తున్నార‌ని జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు.

నిరుద్యోగ భృతితో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చంద్రబాబు మోసం చేశార‌ని.. ఎస్సీల్లో ఎవ‌రైనా పుట్టాల‌ని కోరుకుంటార‌ని ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ధ్వ‌జ‌మెత్తారు. స్టడీ సర్కిళ్లను వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే అభివృద్ధి చేశార‌ని చెప్పారు.

గత మూడేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండు లక్షల మందిని నియమించిందని రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట‌ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోంద‌ని నిప్పులు చెరిగారు. టీడీపీలో చాలా మంది నిరుద్యోగ రాజకీయ నాయకులు, నాయకులు ఉన్నారని, వారికి 2024 తర్వాత భవిష్యత్తు ఉండదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ పెడితే చంద్ర‌బాబు స‌మావేశాల‌కు రాకుండా డుమ్మా కొట్టార‌ని మండిప‌డ్డారు.

టీడీపీ ఎమ్మెల్యేల నిరసనపై ఆర్థిక మంత్రి బుగ్గన‌ రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఉద్యోగాల క్యాలెండర్‌పై చర్చకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని అంగీకరించినా టీడీపీ మొండిగా వ్యవహరించ‌డం స‌రికాద‌న్నారు. ఇది సభా నిబంధనలకు విరుద్ధమ‌ని తెలిపారు. టీడీపీ నేతలు రూల్ బుక్స్ పాటించడం లేద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

చంద్ర‌బాబు దళిత వ్యతిరేకి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు మండిప‌డ్డారు. గత చంద్ర‌బాబు ప్రభుత్వం ఎస్సీలకు చేసేందేమీ లేద‌న్నారు. పేదలకు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేద‌ని గుర్తు చేశారు.

టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయార‌ని గృహ‌నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ మండిప‌డ్డారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేద‌న్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నార‌ని.. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రేన‌ని జోగి నిప్పులు చెరిగారు.

ఇలా అసెంబ్లీ స‌మావేశాలే మొద‌టి రోజు.. మొద‌టి గంట‌లోనే అధికార‌, ప్ర‌తిపక్ష స‌భ్యుల వాగ్యుద్ధానికి దిగాయి. ఇంకా ఒక్క అంశంపైనా చ‌ర్చించ‌కుండానే విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగ‌డంపై ప్ర‌జ‌లు పెద‌వి విరుస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌ప‌కుండా ఈ తిట్లు, శాప‌నార్థాలు ఏమిటని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. అసెంబ్లీ స‌మావేశాల తొలిరోజే ఇలా ఉంటే మ‌రో నాలుగు రోజులు కూడా ఇదే ర‌క‌మైన ప‌రిస్థితి ఉంటుంద‌ని చెప్పుకుంటున్నారు. గ‌తంలోనూ శాస‌న‌స‌భ స‌మావేశాల్లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని.. ఇప్పుడూ అదే రిపీట్ అయ్యింద‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.