Begin typing your search above and press return to search.

రీపోలింగ్ జ‌రుగుతున్న 7చోట్ల ఓట్లు ఎన్నో తెలుసా?

By:  Tupaki Desk   |   19 May 2019 5:28 AM GMT
రీపోలింగ్ జ‌రుగుతున్న 7చోట్ల ఓట్లు ఎన్నో తెలుసా?
X
మొన్న‌టి వ‌ర‌కూ ఆ పల్లెల గురించి చిత్తూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు త‌క్కువే తెలుసు. జిల్లా వ‌ర‌కూ ఎందుకు చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనూ కాస్త మాత్ర‌మే సుప‌రిచితం. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న రీపోలింగ్ నిర్ణ‌యం పుణ్య‌మా అని.. ఆయా ప్రాంతాలు ఇప్పుడు ఫేమ‌స్ అయ్యాయి. ఈ రోజు ఉద‌యం (ఆదివారం) రీపోలింగ్ షురూ అయ్యింది. తొలుత ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అని ప్ర‌క‌టించిన ఈసీ.. శ‌నివారం మ‌రో రెండు కేంద్రాల్ని అద‌నంగా చేరుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో.. యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేస్తూ ఎన్నిక‌ల సంఘం అధికారులు బిజీబిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. రీపోలింగ్ జ‌రుగుతున్న ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఐదు టీడీపీ ప‌ట్టున్న‌వి కాగా.. తాజాగా ప్ర‌క‌టించిన రెండు పోలింగ్ కేంద్రాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టున్న‌వి కావ‌టం గ‌మ‌నార్హం. ఈ మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఐదు వేల‌కు పైనే ఓట్లు ఉన్నాయి. తొలుత రీపోలింగ్ ప్ర‌క‌టించిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి ప‌డిన ఓట్లు సింగిల్ డిజిట్ దాట‌ని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. రీపోలింగ్ జ‌రుగుతుండ‌టం ఇప్పుడు కొత్త ఉద్రిక్త‌త‌కు తెర తీసిన ప‌రిస్థితి.

ఈ ఏడు పోలింగ్ కేంద్రాల్లో తాజాగా జ‌రుగుత‌న్న రీపోలింగ్ తుది ఫ‌లితాల్ని ప్ర‌భావితం చేయ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌.. ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నేసి ఓట్లు ఉన్నాయ‌న్న‌ది చూస్తే.. తుది ఫ‌లితం మీద ప్ర‌భావం ఎందుకు చూపుతుందో అర్థ‌మ‌వుతుంది. ఎందుకంటే.. 2014లో జరిగిన ఎన్నిక‌ల్లో రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య నెల‌కొన్న ఓట్ల వ్య‌త్యాసం చాలా త‌క్కువ‌. త‌క్కువ మెజార్టీతో టీడీపీ ఈ స్థానాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

పోలింగ్‌ కేంద్రం పురుషులు మహిళలు మొత్తం ఓటర్లు
1.ఎన్ ఆర్‌ కమ్మపల్లె 336 362 698

2. పులివర్తివారిపల్లె 391 414 805

3. కొత్తకండ్రిగ 482 482 991

4. కమ్మపల్లె 490 538 1028

5. వెంకట్రామాపురం 179 198 377

6. సి.కాలేపల్లె 295 302 597

7. కుప్పంబాదూరు 465 490 955

ఓట్ల లెక్క ఇలా ఉంటే.. రీపోలింగ్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన భ‌ద్ర‌త క‌నివిని ఎరుగ‌ని రీతిలో ఉండ‌టం విశేషం. మొత్తం బ‌లగాలు వ‌ర్సెస్ మొత్తం ఓట‌ర్లు చూస్తే.. ప్ర‌తి ఇద్ద‌రు ఓట‌ర్ల‌కు ఒక భ‌ద్ర‌తా సిబ్బందిని ఏర్పాటు చేయ‌టం చూస్తే.. రీపోలింగ్ విష‌యంలో ఈసీ ఎంత జాగ్ర‌త్త‌గా ఉందో అర్థం కాక మాన‌దు.

రీపోలింగ్ నేప‌థ్యంలో ఏడు పోలింగ్ కేంద్రాల ప‌రిధిలో తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్న నేప‌థ్యంలో.. ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ ఎత్తున భ‌ద్ర‌తా ద‌ళాల్ని మొహ‌రించారు. రీపోలింగ్ సంద‌ర్భంగా ఎలా గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు అనంత‌పురం రేంజ్ డీఐజీ క్రాంతిరాణా టాటా నేతృత్వంలో మూడంచెల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

భ‌ద్ర‌తా సిబ్బంది ఎంత‌మందంటే..

+ 5గురు అడిషనల్‌ ఎస్పీలు
+ 21 మంది డీఎస్పీలు
+ 80 మంది సీఐలు
+ 155 మంది ఎస్ ఐలు
+ 1,325 మంది పోలీసు సిబ్బంది
+ వంద‌లాదిగా స్పెషల్‌ పార్టీ - ఏపీఎస్పీ - సాయుధ బలగాలు

వీరు కాకుండా మూడు డ్రోన్‌ కెమెరాలు.. 12 రక్షక మొబైల్స్‌.. ఐదు శక్తి టీమ్‌.. బాడీ ఓన్‌ కెమెరాలతో 47 మందితో నిఘాను ఏర్పాటు చేయ‌టం గ‌మ‌నార్హం.