Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రియల్ దూకుడు ఎంతో చెప్పిన జేఎల్ఎల్ నివేదిక

By:  Tupaki Desk   |   9 April 2021 6:36 AM GMT
హైదరాబాద్ రియల్ దూకుడు ఎంతో చెప్పిన జేఎల్ఎల్ నివేదిక
X
బ్రాండ్ హైదరాబాద్ రేంజ్ ఎంతో చెప్పే నివేదికగా దీన్నిచెప్పాలి. కరోనా మహమ్మారి లాంటి గడ్డు పరిస్థితుల్లోనూ మిగిలిన మహానగరాల్ని బీట్ చేసేలా రియల్ రంగంలో దూసుకెళ్లే ప్రత్యేకత హైదరాబాద్ సొంతమని చెప్పాలి. పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోనూ భాగ్యనగరి తన సత్తాను చాటింది. తాజాగావిడుదలైన ప్రాప్ టైగర్.. జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ విషయాల్ని వెల్లడయ్యాయి. మిగిలిన రంగాలకు బిన్నంగా రియల్ రంగం కరోనా కాలంలో భారీగా దెబ్బ తీసింది. పలు ప్రముఖ నగరాల్లో ప్రాజెక్టులు పక్కకు వెళ్లిపోయాయి.

ధరలు కూడా తగ్గాయి. అందుకు భిన్నంగా హైదరాబాద్ ఉందని చెప్పాలి. మిగిలిన ప్రముఖ నగరాల్లో ఇండ్ల అమ్మకాలు.. ఆఫీసు లీజు ధరలు తగ్గితే..అందుకు భిన్నంగా హైదరాబాద్ మాత్రం దూసుకెళ్లటం ఆసక్తికరమని చెప్పాలి. గత ఏడాది జనవరి - మార్చితో పోలిస్తే.. ఈ ఏడాది హౌజింగ్ సేల్ 38 శాతం పెరిగినట్లు రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

హౌజింగ్ లో మాత్రమే కాదు.. ఆఫీసు స్పేస్ లీజుల్లోనూ హైదరాబాద్ మిగిలిన నగరాలతో పోలిస్తే ముందంజలో ఉన్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ తో పోలిస్తే మిగిలిన నగరాలైన బెంగళూరు.. ముంబయి.. చెన్నై.. ఢిల్లీలో తగ్గిపోయాయి. భారీగా పెరుగుతున్న కరోనా కేసులతో ఆఫీస్ మార్కెట్ ను దెబ్బ తీశాయి. కరోనా దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని.. మార్కెట్ పని అయిపోయిందన్న వేళ.. హైదరాబాద్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

గత ఏడాది (జనవరి - మార్చి)తో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలాన్ని పోల్చి చూస్తే.. హైదరాబాద్ లో వృద్ధి రేటు 38 శాతం ఉంటే.. ఢిల్లీలో 14 శాతం.. అహ్మదాబాద్ లో 4 శాతానికే పరిమితమైంది. వీటితో పోలిస్తే.. చెన్నై 23 శాతం.. కోల్ కతా 23 శాతం ఉంది. హైదరాబాద్ కంటే మార్కెట్ ఎక్కువగా ఉంటుందని చెప్పే బెంగళూరులోనూ పరిస్థితి బాగోలేదని చెప్పాలి. ఇదంతా చూస్తే.. మిగిలిన మహానగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ ముందంజలో నిలిచిందని చెప్పక తప్పదు.