Begin typing your search above and press return to search.

ప్రియాంక వార్త‌ల వెనుక మోడీ బ్యాచ్‌?

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:53 AM GMT
ప్రియాంక వార్త‌ల వెనుక మోడీ బ్యాచ్‌?
X
నిన్న ఒక వార్త అంద‌రి దృష్టిని విపరీతంగా ఆక‌ర్షించింది. క్రియాశీల రాజ‌కీయాల్లోకి గాంధీ ప్యామిలీకి సంబంధించి మ‌రో వార‌సురాలు తెర మీద‌కు వ‌స్తున్నారంటూ పెద్ద వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న సోనియాగాంధీ త‌న ప‌ద‌విని త‌న కుమార్తె ప్రియాంక‌కు ఇవ్వ‌నున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

నిజానికి కాంగ్రెస్ ప‌గ్గాల్ని రాహుల్‌ కు అప్ప‌గించాల‌న్న వ్య‌వ‌హారం కొన్నేళ్లుగా పార్టీలో న‌లుగుతోంది. అయితే.. కాంగ్రెస్ ప‌గ్గాలు స్వీక‌రించేందుకు కాంగ్రెస్ యువ‌రాజు సిద్ధంగా లేర‌ని.. ఎప్పటిక‌ప్పుడు వాయిదా వేస్తున్నార‌న్న వార్త‌లు రావ‌టం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో వ‌రుస‌గా ఎదుర‌వుతున్న ఎదురుదెబ్బ‌ల నేప‌థ్యంలో.. రాహుల్ స‌మ‌ర్థ‌త‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇలాంటి వేళ‌లో.. రాహుల్ ను కాద‌ని.. ప్రియాంక‌కు కాంగ్రెస్ ప‌గ్గాలు అప్ప‌గించే దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని కాంగ్రెస్ త్రోసిపుచ్చింది. ప్రియాంకా వాద్రాకు కాంగ్రెస్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల వెనుక మోడీ బ్యాచ్ ఉన్న‌ట్లుగా ఆ పార్టీ ఆరోపిస్తోంది. అన్నీ ఊహాగానాలే త‌ప్పించి.. అందులో ఎలాంటి నిజ‌మూ లేదంది. కేంద్ర‌మే ఇలాంటి వార్త‌ల్ని పుట్టిస్తోంద‌ని.. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించ‌ట‌మే ఉద్దేశంగా కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం ఇన్ ఛార్జి ర‌ణ్ దీప్ సుర్జేవాలా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ.. ప్రియాంక విష‌యంలో వ‌చ్చిన వార్త‌ల‌న్నీ త‌ప్పుదారి ప‌ట్టించేవేన‌ని.. ఇవ‌న్నీ కేంద్ర స‌ర్కారు పుట్టించిన‌వేన‌న్నారు. ఇలాంటివి చూస్తుంటే న‌వ్వు వ‌స్తుంద‌ని.. పార్టీలో ఆ దిశ‌గా అస‌లు చ‌ర్చే జ‌ర‌గ‌లేద‌న్నారు. ఇలాంటి వార్త‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న‌.. తిర‌స్క‌రిస్తే చాలు అన్నారు. మరోవైపు ప్రియాంక కార్యాల‌యం కూడా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ..కాంగ్రెస్‌కు సార‌థ్యం వ‌హిస్తున్న‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల‌న్నీ ఉత్త‌వేన‌ని తేల్చింది.