Begin typing your search above and press return to search.

మంత్రివ‌ర్యుల నేరాల చిట్టా...వైర‌ల్!

By:  Tupaki Desk   |   14 Feb 2020 5:30 PM GMT
మంత్రివ‌ర్యుల నేరాల చిట్టా...వైర‌ల్!
X
అధికారం చేప‌ట్టిన మొద‌టి రోజు నుండే అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ వైసీపీ విప‌రీత‌మైన ప్ర‌చారం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ప్ర‌భుత్వంలో కొంద‌రు టీడీపీ నేత‌లు నేర చ‌రితుల‌ని - టీడీపీ అటువంటి వారిని ప్రోత్స‌హించింద‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ నేత‌లంతా స‌చ్ఛీలుర‌ని - ఇదంతా చూసిన సామాన్య ప్ర‌జ‌లు భ్ర‌మ‌ప‌డ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. కానీ, గురివింద న‌లుపు దానికి తెలియ‌ద‌న్న‌ట్లు...త‌మ పార్టీలోనే ఉన్న నేత‌ల నేర చ‌రిత్ర వైసీపీకి మాత్రం తెలియ‌లేదు. తాజాగా వైసీపీ మంత్రులు - ఎమ్మెల్యేల నేరాల చిట్టా గుట్టు ర‌ట్ట‌వ‌డంతో వైసీపీ నేత‌లు తెల్ల‌బోతున్నారు. వైసీపీ నేత‌ల నేర చ‌రిత్ర‌పై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) విడుద‌ల చేసిన‌ ప్రత్యేక నివేదిక ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌మ‌యంలోనే త‌మ నేర చ‌రిత్ర వివ‌రాల‌ను ఎమ్మెల్యే - ఎంపీ అభ్య‌ర్థులు నామినేష‌న్‌ లో పొందుప‌ర‌చాల‌ని - అంతేకాకుండా ప్రింట్ - ఎల‌క్ట్రానిక్ మీడియాలో బ‌హిరంగ ప్ర‌క‌ట‌నలు ఇవ్వాలని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ప్ర‌క‌ట‌నలు ఎప్పుడు వ‌చ్చాయో...ఎప్పుడు వెళ్లాయో ఎవ‌ర‌కీ తెలీదు. దీంతో, ఏ ఎమ్మెల్యేపై ఏఏ కేసులున్నాయి....అన్న సంగ‌తి పెద్ద‌గా ఎవ‌ర‌కి తెలీదు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా 2019 ఎన్నికల్లో గెలిచి.. అమాత్యులైన వారి నేర చ‌రిత్ర వివ‌రాల‌పై ఏడీఆర్ ఓ స‌మ‌గ్ర నివేదిక రూపొందించింది. జ‌గ‌న్ స‌ర్కారులో ఉన్న మంత్రుల‌లో ఎవరెవరి నేరచరిత్ర ఏమిటి....? వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి..? అన్న వివ‌రాలు వెల్ల‌డించింది.

దీంతోపాటు మంత్రుల విద్యార్హతలు - ఆస్తుల వివరాలు కూడా ఏడీఆర్ వెల్ల‌డించింది. నేరాలు - కేసులతో స‌హా ఒక్కో ఎమ్మెల్యే పేరును ప్రస్థావిస్తూ ఆయా కేసుల వివ‌రాలు, వాటిలోని పురోగతిపై నివేదికనిచ్చింది. ఈ నివేదిక‌లో ఏపీ సీఎం జ‌గ‌న్‌ పైనే ఏకంగా 38 కేసులున్నాయి. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి - మోపిదేవి వెంకటరమణ‌ - శంకర నారాయణ - బాలినేని శ్రీనివాసరెడ్డి - పేర్ని నాని - వెల్లంపల్లి శ్రీనివాసరావు - అనిల్ కుమార్ యాదవ్ - మేకతోటి సుచరిత - కొడాలి నాని - కురసాల కన్నబాబు - బుగ్గన రాజేంద్రనాథ్ - పిల్లి సుభాష్ చంద్రబోస్ - పాముల పుష్పశ్రీ వాణి..వంటి మంత్రులపై ఉన్న కేసుల వివరాల‌ను ఏడీఆర్ రిపోర్టులో వెల్ల‌డ‌య్యాయి. ప్రస్తుతం వైసీపీ మంత్రుల నేరాల చిట్టా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ‌న అమాత్యుల నేరాల చిట్టా చూసిన నెటిజ‌న్లు అవాక్క‌వుతున్నారు.