Begin typing your search above and press return to search.

ఈ సారి `రిప‌బ్లిక్ డే`ను మార్చేసిన మోడీ.. ఎప్పుడంటే!

By:  Tupaki Desk   |   16 Jan 2022 12:30 AM GMT
ఈ సారి `రిప‌బ్లిక్ డే`ను మార్చేసిన మోడీ.. ఎప్పుడంటే!
X
సాధార‌ణంగా దేశ‌వ్యాప్తంగా రిప‌బ్లిక్ డే(గ‌ణ‌తంత్ర దినోత్స‌వం) జ‌న‌వ‌రి 26న జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీ. అయితే.. ఇప్పుడు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ..దీనిని మార్చేశారు. ఈ ఏడాది 'రిపబ్లిక్ డే' ఉత్సవాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినంతోనే ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బోస్ పుట్టినరోజును పురస్కరించుకుని జనవరి 23నే ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మరోవైపు కరోనా కారణంగా డిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు 24,000 మందిని మాత్రమే అనుమతించనున్నారు.

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత‌ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనవరి 23నే గణతంత్ర వేడుకలను ప్రారంభించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా ఈ ఉత్సవాలు జనవరి 24న మొదలవుతాయి. అయితే.. ప్రముఖ వ్యక్తులకు ప్రాధాన్యం దక్కే విధంగా ఇలా మార్పులు చేర్పులు చేయాల‌ని ప్ర‌ధాని మోడీ సూచించారు. దీంతో గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో మార్పులు జ‌రిగాయి.

కరోనా కారణంగా ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ను పరిమిత సంఖ్యతో నిర్వహించనున్నారు. సుమారు 24,000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 19 వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు కాగా.. మిగిలిన 5వేల మంది సాధారణ జనం హాజరుకానున్నారు.

2020లో కరోనాకు ముందు రిపబ్లిక్ ఉత్సవాలకు 1.25 లక్షల మందిని అనుమతించారు. 2021లో ఉత్సవాలకు 25,000 మందిని అనుమతించారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విదేశీ ప్రముఖులు రావట్లేదని సమాచారం. కరోనా నిబంధనల నడుమ, భౌతిక దూరం పాటిస్తూ ఉత్సవాలు జరగనున్నాయి.