Begin typing your search above and press return to search.

ట్రంప్ ను ఇలా తప్పించేయొచ్చట!

By:  Tupaki Desk   |   10 Oct 2016 10:30 PM GMT
ట్రంప్ ను ఇలా తప్పించేయొచ్చట!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫు బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ పై రచ్చ రచ్చ జరుగుతున్న వేళ.. ఆయన్నుపార్టీ అభ్యర్థిత్వం నుంచి బయటకు పంపేయాలన్నడిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల కాలంలో మహిళల మీదా.. చివరకు తన కుమార్తె మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారం తాజాగా దుమ్ముదుమారంగా మారింది. ఇలాంటి వ్యక్తిని అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఎలా దించుతారన్న ప్రశ్న తెర మీద రావటమే కాదు.. సొంత పార్టీకి చెందిన వారు ట్రంప్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆయన్ను వెంటనే అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరి.. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న ట్రంప్ ను తప్పించటం సాధ్యమయ్యే పనేనా? అంటే సాధ్యమేనని చెబుతున్నారు పలువురు రిపబ్లికన్లు. పార్టీ రూల్ బుక్ లో 9వ రూల్ ప్రకారం ఆర్ ఎన్ సీలో ఓటింగ్ ద్వారా అధ్యక్ష అభ్యర్థిని మార్చవచ్చని.. అభ్యర్థి చనిపోవటమో.. ఆరోగ్యం క్షీణించటమో ఇంకేదైనా కారణాలు చూపించి కానీ తప్పించొచ్చన్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ తనకు తానుగా బరిలో నుంచి తప్పుకోవటమో లేదంటే.. 168 మంది డెలిగేట్స్ ఉన్న ఆర్ ఎన్ సీ భేటీలో పూర్తిస్థాయి మెజార్టీ లభించిన పక్షంలో ట్రంప్ ను అధ్యక్ష స్థానం నుంచి తప్పించి.. ఉపాధ్యక్షపదవికి బరిలో ఉన్న మైక్ పెన్స్ ను బరిలో దించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల విడుదలైన వీడియోలతో ట్రంప్ పరపతి దారుణంగా దెబ్బ తినటంతో పాటు.. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని రిపబ్లికన్లు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ బరిలో నుంచి తప్పుకోవాలంటూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు తాజాగా గళం విప్పిన నేపథ్యంలో ట్రంప్ అభ్యర్థిత్వం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/