Begin typing your search above and press return to search.

మురుగునీటిలో మహమ్మారి.. మనోళ్ల మొనగాడితనం ఎంతంటే?

By:  Tupaki Desk   |   23 Jun 2020 11:15 AM IST
మురుగునీటిలో మహమ్మారి.. మనోళ్ల మొనగాడితనం ఎంతంటే?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి సంబంధించిన మరో గుట్టును రట్టు చేశారు. మాయదారి రోగానికి చెక్ పెట్టే పోరులో భారతీయ శాస్త్రవేత్తలు వేసిన ముందడుగు ప్రపంచంలోని ప్రయోగాలకు మరో మార్గదర్శకంగా మారుతుందని చెబుతున్నారు. దేశంలోనే తొలిసారి గుజరాత్ లోని ఐఐటీ గాంధీనగర్ శాస్త్రవేత్తలు మురుగునీటిలో కరోనా జాడపై అధ్యనం చేశారు. ఈ సందర్భంగా వారు ఆనవాళ్లను గుర్తించారు.

అహ్మదాబాద్ లోని ఓల్డ్ పిరానా మురుగు శుద్ధి ప్లాంట్ నుంచి మే ఎనిమిది.. 27 తేదీల్లో శాంపిళ్లను సేకరించారు. వాటిని ఆర్ టీ క్యూపీసీఆర్ టెక్నాలజీతో పరీక్షించారు. ఈ పరీక్షల్లో మూడు రకాల కరోనా జన్యు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. మే 8న సేకరించిన శాంపిళ్ల కంటే మే 27న పరీక్షించిన శాంపిళ్లలో కరోనా జన్యు పదార్థాలు 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.అహ్మదాబాద్ లో మే 8తో పోలిస్తే.. 27న రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయని.. దీని ద్వారా కరోనా విస్తరణ ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని తాజా ప్రయోగంతో తేటతెల్లమయ్యే అవకాశం ఉందంటున్నారు.

తాజా ప్రయోగం వల్ల కలిగే ప్రయోజనం ఏమంటే.. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పెరిగే పాజిటివ్ కేసులకు.. ఆ ప్రాంతం నుంచి విడుదలయ్యే మురుగు నీటికి అవినాభావ సంబంధం ఉంటుంది. దీంతో.. మురుగనీటితో అంటువ్యాధులు ఎంతమేర ప్రబలే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించే పద్దతిని అనుసరిస్తున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరనుంది. ఈ క్రెడిట్ లో గాంధీనగర్ ఐఐటీ శాస్త్రవేత్తలదే కీలకమని చెప్పక తప్పదు.