Begin typing your search above and press return to search.

సినీ నటి భావన పై అగ్రనటుడు దిలీప్ ఎందుకంత పగ?

By:  Tupaki Desk   |   13 Jan 2022 5:58 AM GMT
సినీ నటి భావన పై అగ్రనటుడు దిలీప్ ఎందుకంత పగ?
X
రీల్ లో మాత్రమే కనిపించే దారుణ సీన్లు.. అప్పుడప్పడు రియల్ గా కూడ జరుగుతుంటాయి. దాదాపు ఐదేళ్ల క్రితం సినీ నటి భావన కారులో వెళుతుంటే.. కిడ్నాప్ చేసి.. గ్యాంగ్ రేప్ చేసిన దురాగతం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతం సినిమాటిక్ మలుపులు తిరగటం.. ఈ దారుణ నేరంలో పాలు పంచుకున్న నిందితులు వ్యవహారం ఒక ఎత్తు అయితే.. వారిని అలా పురిగొల్పిన పాపం మాత్రం అగ్రనటుడిగా పేరున్నదిలీప్ పేరు బలంగా వినిపించటం తెలిసిందే. సుపారీ ఇచ్చి మరీ.. భావనను దెబ్బ తీయాలన్న దుర్మార్గపు ప్లాన్ ఎందుకు వేశారు? అసలు సినీ నటి భావనపై ఎందుకంత పగ? అన్నది అసలు ప్రశ్న.

ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఐదేళ్ల క్రితం తనకు జరిగిన అన్యాయం గురించి.. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్టు పెట్టారు. దీనికి కారణం లేకపోలేదు. భావన లైంగిక దాడి కేసు విచారణలో పోలీసులపై నటుడు దిలీప్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ తాజాగా మరో కేసు నమోదు కావటంతో.. ఆమె స్పందించారు. దీంతో.. వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏమిటి? అసలేం జరిగింది? అన్నదిప్పుడు మరోసారి చర్చగా మారింది.

నటి భావన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆమె మూడు.. నాలుగు సినిమాలు చేశారు. కన్నడ.. మలయాళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. కేరళలో ఆమెకు మంచి పేరుంది. ఇక.. నటుడు దిలీప్ విషయానికి వస్తే.. అతడు మలయాళ చిత్ర పరిశ్రమలో పేరున్న అగ్ర హీరోనే కాదు.. నిర్మాతగా.. వ్యాపారవేత్తగా సుపరిచితుడు. దాదాపు 150 సినిమాల్లో నటించాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన దిలీప్.. మలయాళ సినీ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయి వరకు ఎదిగాడు. అంతటి పేరున్న అతడు.. భావన రేప్ కేసులో అతడి పేరు ప్రఖ్యాతులన్ని మసకబారటమే కాదు.. మలయాళం మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ఆయన్ను బహిష్కరించింది.

ఇంతకూ నటి భావనపై దిలీప్ అంతలా పగ పెంచుకోవటానికి కారణం ఏమిటి? అన్న విషయంపై చాలామందితో పాటు పోలీసు వర్గాలు చెప్పేదేమంటే.. దిలీప్ కు మలయాళ నటి మంజూ వారియర్ తో 1998లో పెళ్లైంది. అయితే.. తర్వాతి కాలంలో దిలీప్ కట్టు తప్పి.. నటి కావ్య మాధవన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణ ఉంది. దిలీప్.. కావ్యల మధ్య బంధాన్ని నిరూపించే సాక్ష్యాల్ని మంజూ వారియర్ కు భావన ఇచ్చారని చెబుతారు. దీంతో.. ఆమెపై దిలీప్ పగ పెంచుకున్నారని చెబుతారు.

దీంతో దిలీప్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. మంజూవారియర్ భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. అనంతరం 2016లో కావ్య మాధవన్ ను దిలీప్ పెళ్లాడారు. అయితే.. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని.. మంజూ వారియర్ తో తన వైవాహిక సంబంధం తెగ తెంపులు కావటానికి నటి భావనే కారణమని రగిలిపోయిన దిలీప్.. ఆమెపై ఏదోలా పగ తీర్చుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా.. సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీతో దిలీప్ బేరం కుదుర్చుకొని.. ఆమెను గ్యాంగ్ రేప్ చేయాల్సిందిగా సుపారీ ఇచ్చినట్లు చెబుతారు. ఈ డీల్ విలువ రూ.1.5 కోట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు పోలీసుల ఛార్జిషీట్ లోనూ పేర్కొన్నారు.

తాము కుదుర్చుకున్న గలీజ్ డీల్ లో భాగంగా.. త్రిసూర్ నుంచి కొచ్చికి ప్రయాస్తున్న భావనను కిడ్నాప్ చేశారు. రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న కారును వ్యాన్ తో ఢీ కొట్టారు.డ్రైవర్ ను బలవంతంగా బయటకు లాగేసి.. కారులోకి చొరబడ్డారు. ఆ తర్వాత కారులో తిరుగులూ మూడు గంటల పాటుభావనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

ఆ సమయంలో కొన్ని వీడియోలు.. ఫోటోలు తీశారు. చివరకు కొచ్చిలోని ఒక ప్రాంతంలో ఆమెను వదిలేసి పారిపోయారు. ఇదో పెను సంచలనంగా మారటమే కాదు.. పలు మలుపులు తిరిగింది. భావన డ్రైవర్ మార్టిన్ సైతం ఈ కుట్రలో భాగం ఉందని చెబుతారు. అతడు సహకరించటం వల్లే ఈ దారుణం జరిగిందంటారు. ఈ కేసుకు సంబంధించి నిందితులతోపాటు నటుడు దిలీప్ ను 2017 జులైలో పోలీసులు అరెస్టు చేశారు.

అదే ఏడాది అక్టోబరులో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇటీవల ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసుల్ని బెదిరించాడని పేర్కొంటూ మరో కేసు నమోదైంది. ఇప్పటికే భావన ఉదంతంలో దారుణంగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవటంతోపాటు.. ఒకప్పుడు అతన్ని అభిమానించిన వారంతా తిట్టిపోయించుకునే పరిస్థితికి తెచ్చుకున్న అతడు.. అంతకంతకు మరింతగా ఇరుక్కుపోతున్నాడు.