Begin typing your search above and press return to search.

ఆ నగరంలో ఐదు రోజుల బట్టలు ఉతకొద్దంటూ ఆర్డర్!

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:35 AM GMT
ఆ నగరంలో ఐదు రోజుల బట్టలు ఉతకొద్దంటూ ఆర్డర్!
X
రానున్న రెండు రోజులు మీకు నీళ్లు రావు.. రేపటి నుంచి ఫలానా వేళల్లో కరెంటు ఉండదు లాంటి ప్రకటనలు చూస్తుంటాం. కానీ.. ఐదు రోజుల పాటు బట్టలు ఉతుక్కోవద్దన్న ప్రకటన మాత్రం సరికొత్తదే. ఇంతకీ ఈ ప్రకటన ఎక్కడో తెలుసా? అమెరికాలోని నార్త్ కరోలినాలోని సర్ఫ్ సిటీలో చోటు చేసుకుంది. బట్టలు ఉతుక్కోవద్దని అంటే అన్నారు కానీ.. విషయం మొత్తం విన్నాక మాత్రం.. ప్రజల విషయంలో ప్రభుత్వ అధికారులు చూపించే శ్రద్ధకు ముచ్చట వేయక మానదు.

ఇంతకీ.. ఐదు రోజుల పాటు బట్టలు ఉతుక్కోవద్దని ఆర్డర్ వేయటానికి కారణం.. ప్రజలకు నష్టం కలుగకూడదనేనట. స్థానికంగా సరఫరా చేసే నీటిలో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. అలాంటి నీటిలో దుస్తుల్ని ఉతుక్కుంటే వాటికి నష్టం జరిగే ప్రమాదం ఉందని.. అందుకే ఐదు రోజుల పాటు బట్టలు ఉతుక్కోవద్దన్న సూచన చేశారు.

మన దగ్గర తాగే నీరు రంగు మారి వచ్చినా.. బురదతో నిండి వచ్చినా సమాధానం చెప్పని తీరుతో పోలిస్తే.. సదరు అధికారులు దేవుళ్ల మాదిరి చెప్పుకోవాలి. ప్రజలకు సరఫరా చేసే నీటిలో ఇనుము శాతం ఎక్కువగా ఉందన్న విషయానికి వారిచ్చే ప్రాధాన్యత చూస్తే.. పౌరసేవల విషయంలో మనమెంత దూరంలో ఉన్నామో ఇట్టే అర్థం కాక మానదు.

మేం నీళ్లు సరఫరా చేయటమే మీరు చేసుకున్న పుణ్యమన్నట్లుగా మాట్లాడే అధికారులకు.. సర్ఫ్ సిటీలో అధికారులకు ఏ మాత్రం పోలిక లేదనే చెప్పాలి. ఇంతా చేస్తే.. అధికారుల తీరును అక్కడి స్థానిక ప్రజలు రుసరుసలాడుతున్నారట.

ఎందుకంటే.. ఈ ప్రకటనను సోషల్ మీడియాలోనే చేశారని..వాటిని ఫాలో కాని వారి పరిస్థితి ఏమిటంటూ తలంటుతున్నారు. ఇంత ముఖ్యమైన ప్రకటనను ఇంతనిర్లక్ష్యంగా సోషల్ మీడియలో చెప్పేసి ఊరుకుంటారా? సోషల్ మీడియాను ఫాలోకాని వాళ్ల పరిస్థితి ఏమిటంటూ గుస్సా అవుతున్నారట. ఈ లెక్కన అలాంటోళ్లను మనలాంటి చోటుకు తీసుకొస్తే ఏమవుతారో కదూ?