Begin typing your search above and press return to search.

ఏందిది మోడీ సాబ్? ‘రిజైన్’ సీన్ ట్రెండింగ్ గా మారటమేమిటి?

By:  Tupaki Desk   |   1 Sep 2020 6:29 PM GMT
ఏందిది మోడీ సాబ్? ‘రిజైన్’ సీన్ ట్రెండింగ్ గా మారటమేమిటి?
X
ఎంత ఎత్తుకు ఎగిసిన కెరటమైనా.. తర్వాత కిందకు జారటమే. ఈ పోలిక మోడీ అభిమానుల్ని.. ఆరాధకుల్ని తీవ్రంగా కలిచివేయటమే కాదు.. ఇలా ఎలా రాస్తారు? మనసులో విషం పెట్టుకున్నారంటూ తిట్టిపోసే అవకాశం ఉంది. ఒకవేళ.. ఈ పోలిక కాదనుకుంటే.. శిఖరాగ్రానికి చేరటం తేలికే.. కానీ అక్కడ ఎంతసేపు ఎలాంటి సమస్య లేకుండా నిలుస్తారన్నదే ప్రశ్న అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

ప్రధాని మోడీ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఇప్పుడు నెలకొంది. దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నోటి వచ్చే మాటలకు ఆయన తీసుకునే నిర్ణయాలకు జనం ఊగిపోతుంటారు. ఇలాంటి ప్రధాని ఎంతకాలానికి వచ్చారంటూ జయధ్వానాలు చేసే వారికి కొదవ ఉండదు. అలాంటి మోడీకి గడిచిన రెండు రోజులుగా ఏ మాత్రం బాగున్నట్లు లేదు.

గడిచిన ఆరేళ్ల మూడు నెలల (సుమారు) కాలంలో ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు నెలల్లో దేశ జీడీపీ మైనస్ 23.9 శాతానికి పడిపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోడీని.. కేంద్రఆర్థిక మంత్రి నిర్మలమ్మను తమ పదవులకు రాజీనామాలు చేయాలంటూడిమాండ్ చేయటం.. ట్విట్టర్ లో రిజైన్ (RESIGN) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది.

ప్రధాని.. ఆర్థిక మంత్రి పెద్దగా పట్టించుకోకపోవటం వల్లే ఇప్పుడు ఇలాంటి దుస్థితి దేశానికి ఏర్పడిందన్న వాదనను వినిపిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ఒక అంశం ట్రెండ్ కావటం ఇదే తొలిసారి. ఇక.. ఆదివారం మోడీ మన్ కీ బాత్ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా.. లక్షలాది డిస్ లైకులు రావటం హాట్ టాపిక్ గా రావటం తెలిసిందే. ఏమిటో.. గడిచిన రెండు రోజులుగా మోడీ వారికి సోషల్ మీడియాలో వరుస ఎదురుదెబ్బలు తగలటం సంచలనంగా మారింది.