Begin typing your search above and press return to search.

ఆ ఏపీ కీల‌క స‌ల‌హాదారు రాజీనామా నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 11:30 PM GMT
ఆ ఏపీ కీల‌క స‌ల‌హాదారు రాజీనామా నిజ‌మేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి మాన‌స‌పుత్రిక‌ల్లో ఒక‌టిగా ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మాన్ని చెబుతుంటారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యా రంగంలో తెచ్చిన సంస్క‌ర‌ణ‌ల్లో ఇది కూడా ఒక‌టి. సౌక‌ర్యాల లేమిలో కునారిల్లుతున్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో దాదాపు ప‌ది ర‌కాల సౌక‌ర్యాలు (స్కూళ్ల‌కు ప‌క్కా భ‌వ‌నాలు, త‌ర‌గ‌తి గ‌దులు, తాగునీటి సౌక‌ర్యం, బాల‌బాలిక‌లు వేర్వేరుగా మ‌రుగుదొడ్లు, డిజిట‌ల్ ప‌రిక‌రాలు, క్రీడా మైదానం, స్కూళ్ల చుట్టూ ప్ర‌హ‌రీ గోడ‌, విద్యార్థులు కూర్చోవ‌డానికి బెంచీలు, పాఠ‌శాల‌ల‌కు చూడ‌చ‌క్క‌ని రంగులు, త‌దిత‌ర‌) తదిత‌రాల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను నాడు-నేడు కింద స‌మూలంగా మారుస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల నాడు-నేడు ప‌థ‌కం స‌ల‌హాదారుగా తెలంగాణ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళిని వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే నియ‌మించుకుంది. అయితే ఆయ‌న ఇప్పుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయనున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కొంతకాలం నుంచి నాడు-నేడు పనుల్లో రాజకీయ జోక్యం మితిమీరడంతో ఆయ‌న రాజీనామా చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆకునూరి మురళి అక్కడి టీఆర్ఎస్ ప్ర‌భుత్వంతో వ‌చ్చిన‌ విభేదాలతో ఇంకా ప‌ది నెల‌లు స‌ర్వీస్ ఉండ‌గానే ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశారు. అనంతరం నాడు-నేడు పనులకు సలహాదారుగా నియమితులయ్యారు. పనుల విషయంలో నిక్కచ్చిగా ఉంటారని, ఇతరుల జోక్యాన్ని అంగీకరించరని ఆయ‌న‌కు పేరుంది.

అయితే కొంత‌మంది వైఎస్సార్సీపీ నేత‌లు నాడు-నేడు ప‌నుల్లో జోక్యం చేసుకోవ‌డం, కాంట్రాక్టులు త‌మ‌కు ఇవ్వాల‌ని ఒత్తిడి చేయ‌డం వంటివి చేస్తున్నార‌ని.. అవి న‌చ్చ‌కే ముర‌ళి రాజీనామా బాట ప‌ట్టాల‌నుకుంటున్న‌ట్టు ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

కాగా అప్ప‌ట్లో తెలంగాణ‌లో భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్న మురళిని తెలంగాణ ప్రభుత్వం ఆప్రాధాన్యత గల పురావాస్తు శాఖ సంచాలకులుగా బదిలీ చేసింది. దీంతో మనస్తాపం చెందిన ఆయ‌న‌ రాజీనామా చేశారు. ద‌ళిత ఐఏఎస్ అధికారి అయిన ఆకునూరి ముర‌ళి అప్ప‌ట్లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారుల‌ను అప్రాధాన్య పోస్టుల్లో నియ‌మిస్తున్నార‌ని.. వారిని అణ‌చివేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ముక్కుసూటి అధికారిగా, నిజాయ‌తీప‌రుడిగా పేరుండ‌టంతో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆయ‌న‌ను నాడు-నేడు ప‌థ‌కం స‌ల‌హాదారుగా నియ‌మించారు. అయితే ఇప్పుడు వాటిలో మితిమీరిన రాజ‌కీయ జోక్యం ఉంటోంద‌ని క‌ల‌త చెందిన ఆయ‌న రాజీనామా బాట ప‌ట్టాల‌నుకుంటున్న‌ట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.