Begin typing your search above and press return to search.

మొన్నకంట కన్నీరు.. నేడు ధర్మాగ్రహం

By:  Tupaki Desk   |   2 Oct 2016 5:01 AM GMT
మొన్నకంట కన్నీరు.. నేడు ధర్మాగ్రహం
X
ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి. తమ తీర్పుల్ని ఎవరైనా తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించే సత్తా.. రాజ్యాంగబద్ధమైన అధికారం ఉన్న వ్యక్తి. అలాంటి పెద్దమనిషి కంట ఆవేదనతో కన్నీరు కారటానికి మించిన సంచలనం ఇంకేం ఉంటుంది? ఆ మధ్యన న్యాయవ్యవస్థ మీద పెరిగిన అంతులేని భారాన్ని ప్రస్తావించిన సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కంట కన్నీరు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్నే రేపింది. ఇది జరిగిన కొద్ది నెలల తర్వాత.. తాజాగా మరోసారి ఆయన తన ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. న్యాయవ్యవస్థ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సీరియస్ అయిన ఆయన.. సూచనల రూపంలో తాను చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశారు. ప్రభుత్వ అసమర్థత.. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్య తీవ్రత.. ఉదాసీనత కారణంగా న్యాయవ్యవస్థపై పడుతున్న పెనుభారాన్ని ప్రస్తావించటం మరోసారి సంచలనంగా మారింది.

కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో న్యాయవ్యవస్థపై కేసుల పెనుభారం పడుతోందని.. దీని నుంచి ఉపశమనం కలిగించే ఒక యంత్రాంగాన్ని రూపొందించాలంటూ కేంద్ర న్యాయశాఖకు భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. ఒక వివాదం కోర్టు బయట పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నప్పుడు.. సదరు పౌరుడు దాఖలు చేసిన కేసును చేపట్టాలా? వద్దా? అన్న సంగతి తేల్చేందుకు మాజీ జడ్జిలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. న్యాయవ్యవస్థపై పడుతున్న పెను భారంపై వెంటనే నిర్ణయాలు తీసుకోకపోవటం ప్రభుత్వ చేతకానితనంగా ఆయన అభివర్ణించారు.

రోజురోజుకీ పెరుగుతున్న భారాన్ని తలకెత్తుకోవటానికి తాము సిద్ధంగా లేమన్న ఆయన.. న్యాయవ్యవస్థకు ఉపశమనం కలిగించేందుకు ఒక యంత్రాంగం ఏర్పాటుకు న్యాయశాఖామంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని అనవసరమైన కేసులు కోర్టు దాకా రాకుండానే ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించొచ్చన్న సూచన చేశారు. మాజీ జడ్జిలతో కమిటీ వేయాలన్న ఠాకూర్ సూచనపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా.. అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి పదే పదే ధర్మాగ్రహం కేంద్రంలోని సర్కారుకు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని మోడీ సర్కారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/