Begin typing your search above and press return to search.

జగన్ పై మందుబాబుల గుస్సా

By:  Tupaki Desk   |   2 Oct 2019 7:28 AM GMT
జగన్ పై మందుబాబుల గుస్సా
X
దసరాకు ఇంకా వారం రోజులే.. అప్పుడే పండుగకు దేశవిదేశాల్లో ఉన్న వారంతా ఇళ్లకు వచ్చేస్తున్నారు. పండుగ ఊపులో దావత్ లు పోటెత్తుతున్నాయి. కానీ జగన్ ఇచ్చిన షాక్ తో ఇప్పుడు వాళ్లు నెత్తి నోరు బాదేసుకుంటున్నారు. మహిళలు మాత్రం తెగ హ్యాపీగా ఉన్నారట.. జగన్ నిర్ణయం కొందరికి ఖేదం మిగిల్చగా.. మరికొందరికి మోదం తెచ్చింది. ఇంతకీ జగన్ పై గుస్సాగా ఉన్నవారు ఎవరో తెలుసా.? వారే మందు బాబులు..

సెప్టెంబర్ 30తో ప్రైవేటు మద్యం షాపులకు ఏపీలో తెరపడింది. ఏపీ చరిత్రలోనే తొలిసారి సీఎం జగన్ సర్కారీ వైన్ షాపులు పెట్టించాడు. ఏపీలో మద్యపాన నిషేధం దిశగా తొలి అడుగులు వేస్తానన్న జగన్ సర్కారు వైన్స్ కాలపరిమితిని తగ్గించేశాడు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే సర్కారీ వైన్ షాపులు రాత్రి 8 గంటలకే బంద్ అయిపోతాయి.

అయితే ఇది తెలియని చాలా మంది మందుబాబులు నిన్న ప్రారంభమైన సర్కారు మద్యం షాపుల వద్దకు ఉదయం 9 గంటలకే క్యూ కట్టారు. నాలుక పీకేస్తున్నా ఓపిక పట్టారు. కానీ 11 గంటలకు తెరుచుకున్న షాపులు చూసి బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.. అక్కడ ఎగబడి కొనుక్కొని ఎలాగోలా తాగారు.ఇక పనులు పూర్తి చేసుకొని రాత్రి 9 గంటలకు వైన్ షాపులకు పోతే బంద్ ఉన్నాయి. సర్కారీ వైన్ షాపుల డెడ్ లైన్ రాత్రి 8 గంటలకే . దీంతో నెత్తినోరు బాదేసుకున్నారట మందు బాబులు.. పైగా ఒక్కొక్కరు కొనే మద్యం బాటిల్స్ పరిమితిని జగన్ టైట్ చేయడంతో నిన్న మద్యం ఎక్కడా దొరకలేదట..

ఇలా నిన్న మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డ మందుబాబులకు ఈరోజు మరింత చుక్కలు కనిపించాయి. గాంధీ జయంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఈరోజు మద్యం షాపుల బంద్. సో నిన్న రాత్రి తాగక.. ఈరోజు మొత్తం తాగక మందుబాబులు మద్యం దొరక్క పిచ్చెక్కిపోయిన్నారు. కానీ వీరిని మందు బంద్ చేయించిన జగన్ పాలసీకి మాత్రం మహిళలు జై కొడుతున్నారు. జగన్ తీసుకున్న ఈ సర్కారీ వైన్ షాపుల సంస్కరణలతో మద్యం బాబులకు జగన్ విలన్ గా మారగా.. మెజార్టీ ప్రజల్లో మాత్రం మంచి స్పందన రావడం విశేషం.