Begin typing your search above and press return to search.

తాజ్‌ ను బాగు చేయండి..లేదా కూల్చేయండి

By:  Tupaki Desk   |   12 July 2018 1:30 AM GMT
తాజ్‌ ను బాగు చేయండి..లేదా కూల్చేయండి
X
ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటైన తాజ్‌ మహల్ అనూహ్య వార్త‌ల‌తో తెర‌మీద‌కు వ‌స్తోంది. తాజ్‌ మహల్ సముదాయం లోపల ఉన్న మసీదులో స్థానికేతరులు (ఆగ్రా నివాసితులు కాని బయటి వారు) ప్రార్థనలు చేసేందుకు అనుమతించబోమని సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పిన క‌ల‌క‌లం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే...తాజాగా తాజ్ మహల్ విషయంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రోజురోజుకి కాలుష్యం వల్ల మసకబారుతున్న వైభవం - మరోవైపు గాలి - దుమ్ముతో తాజ్‌ మహల్ పై రంగు మారటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. `తాజ్‌ మహల్ ను బాగు చేయండి చేతగాకపోతే కూల్చేయండి`` అంటూ ప్రభుత్వాల తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజ్‌ మ‌హల్ పరిరక్షణ విషయంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై దాఖ‌లైన పిటిష‌న్‌ పై విచార‌ణ సంద‌ర్శంగా సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాజ్ అందాల ప‌రిర‌క్షణ విష‌యంలో యూపీ ప్రభుత్వం - కేంద్రం తీసుకుంటున్న చర్యలు - ప్రణాళికను డాక్యుమెంట్ రూపంలో కోర్టుకి సమర్పించాలని జస్టిస్ ఎంవీ లోక్ - దీపక్ గుప్తా బెంచ్ ఆదేశించింది. కొన్నేళ్లుగా తాజ్ మహల్ రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాజ్ మహల్ పరిరక్షణ కోసం యూపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అసంబద్ధంగా ఉన్నాయని.. ప్రణాళిక బద్ధంగా జరగటం లేదని అభిప్రాయపడింది. ఎంతో చారిత్రక కట్టడం పరిరక్షణ విషయంలో విజన్ అనేది లేకపోవటాన్ని తప్పుబట్టింది. ముల్తానా మట్టితో చేస్తున్న కోటింగ్ వల్ల తాజ్ అందమే దెబ్బతింటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. జూలై 31వ తేదీ వరకు రోజువారీ వాదనలు జరుగుతాయని బెంచ్ తెలిపింది.తాజ్ మహల్ పరిరక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోవటాన్ని తప్పుబట్టింది కోర్టు.మీ వల్ల కాకపోతే మేం మూసేస్తాం అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.