Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో బీజేపీ బ‌లం 104?.. 103?

By:  Tupaki Desk   |   16 May 2018 5:05 AM GMT
క‌ర్ణాట‌క‌లో బీజేపీ బ‌లం 104?.. 103?
X
క‌ర్ణాట‌క ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు ఎన్ని అన్నంత‌నే 104 అని చెప్పేస్తారు. రాజ‌కీయాల మీద ఆస‌క్తి ఉన్న చిన్న పిల్లాడు సైతం చెప్పేస్తారు. కానీ.. తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీకి 104 సీట్లు వ‌చ్చిన‌ట్లు క‌నిపించినా.. సాంకేతికంగా ఆ పార్టీకి వ‌చ్చిన సీట్లు 103 మాత్ర‌మే. ఎందుకంటే.. ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ప్ర‌క‌టించిన సీట్ల‌లో బీజేపీకి వ‌చ్చింది 103 మాత్ర‌మే. 104 స్థానాల్లో అభ్య‌ర్థులు గెలిచినా.. 103 స్థానాల్లోనే గెలిచిన‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం ఎందుకు ప్ర‌క‌టించింది. ఒక స్థానం రిజ‌ల్ట్ ను ఎందుకు హోల్డ్ చేసింద‌న్న విష‌యంలోకి వెళితే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

కర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి.. బీజేపీ అభ్య‌ర్థి జ‌గ‌దీష్ షెట్ట‌ర్ హుబ్లీ-ధార్వాడ నుంచి బరిలోకి దిగారు. ఆయ‌న 20 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌లితాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఎందుకిలా అంటే.. దానికి కార‌ణం లేక‌పోలేదు. షెట్ట‌ర్ కు 72,182 ఓట్లు రాగా.. ఆయ‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి.. కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌హేష్ నెల‌వాడ‌కు 49,835 ఓట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో షెట్ట‌ర్ గెలిచిన‌ట్లుగా ప్ర‌క‌టించారు.

కానీ.. ఇక్క‌డే ఓ ట్విస్ట్ తెర మీద‌కు వ‌చ్చింది. ఇరువురికి క‌లిసి వ‌చ్చిన ఓట్ల‌కు.. పోలైన ఓట్ల‌కు మ‌ధ్య అంత‌రం ఉంది. దీంతో ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్ల‌టంతో బీజేపీ అభ్య‌ర్థి గెలుపు అంశాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌కుండా ఉండిపోయారు. ఈ లెక్క తేడా ఎందుకు వ‌చ్చింద‌న్న అంశంపై దృష్టి సారిస్తున్న ఎన్నిక‌ల సంఘం.. హుబ్లీ-ధార్వాడ ఫ‌లితాల్ని ప్ర‌క‌టించ‌కుండా నిలిపివేశారు. దీంతో.. 104 మంది ఎమ్మెల్యేలు విజ‌యం సాధించిన‌ట్లుగా బీజేపీ నేత‌లు చెప్పినా.. సాంకేతికంగా మాత్రం ఇప్పుడా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బ‌లం అధికారికంగా మాత్రం 103 మాత్ర‌మేన‌ని చెప్పక త‌ప్ప‌దు.