Begin typing your search above and press return to search.

బాబు ప్రియ‌మైన గురువు కేసులో బుక్క‌య్యాడు

By:  Tupaki Desk   |   4 Aug 2016 8:22 AM GMT
బాబు ప్రియ‌మైన గురువు కేసులో బుక్క‌య్యాడు
X
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా యోగా సెంటర్ స్థాపకుడు జగ్గీ వాసుదేవ్ మ‌రోమారు వార్తల్లోకెక్కారు. టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు గతంలో ఏపీ ఎమ్మెల్యేలకు జగ్గీ వాసుదేవ్‌ యోగాపై శిక్షణ తరగతులు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు జ‌గ్గీ సంస్థ‌ల‌కు బాబు పెద్ద ఎత్తున న్యాయం చేసేలా భూ కేటాయింపులు చేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది. అలాంటి బాబు స‌న్నిహిత బాబాపై తమిళనాడుకు చెందిన ఓ వృద్ధ దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. తమ ఇద్దరు కూతుళ్లను వాసుదేవ్ బందీలుగా పట్టుకున్నారని ఆ దంపతులు ఏకంగా కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు.

కోయంబత్తూరు జిల్లాలోని వాడవల్లికి చెందిన కామరాజ్ దంపతులకు గీతా కామరాజ్ (33) - లతా కామరాజ్ (31) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గీత ఎమ్‌టెక్ వరకు చదవగా - లత బీటెక్ పూర్తి చేసింది. ఇటీవల యోగా నేర్చుకునేందుకు వారిద్దరూ కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యలోని ఈషా యోగా సెంటర్‌ కు వెళ్లారు. ఈ క్రమంలో వారిని పూర్తిగా మార్చేసిన జగ్గీ వాసుదేవ్ వారిని సన్యాసులుగా మార్చేయత్నం చేశారట. ఈ క్రమంలో వారిని అసలు తన ఆశ్రమం గేటు దాటనీయడం లేదు. అంతే కాకుండా తన కూతుళ్లతో కామరాజ్ మాట్లాడేందుకు కూడా వాసుదేవ్ అనుమతించడం లేదట. దీంతో కామరాజ్ సతీ సమేతంగా నేరుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తన కూతుళ్ల పరిస్థితిపై కలెక్టర్‌ కు ఓ వినతిపత్రం సమర్పించారు. ఉన్నత విద్యావంతులైన తన కూతుళ్లకు తాను పెళ్లిళ్లు చేయాలనుకుంటుంటే, ఆయన వారిని సన్యాసులుగా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆ వినతిపత్రంలో ఆరోపించారు. తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని జగ్గీ వాసుదేవ్ కబంధ హస్తాల నుంచి తన ఇద్దరు కూతుళ్లకు విముక్తి కల్పించాలని ఆయన కలెక్టర్‌ ను కోరారు.