Begin typing your search above and press return to search.

కాళేశ్వరం మూసుకోవాల్సిందేనా? రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యల వెనుక నిజమెంత?

By:  Tupaki Desk   |   30 May 2022 11:30 AM GMT
కాళేశ్వరం మూసుకోవాల్సిందేనా? రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యల వెనుక నిజమెంత?
X
ఆకునూరి మురళి.. తెలంగాణలో భూపాలపల్లి కలెక్టర్ గా ఈయన చేసిన సంస్కరణలు అద్భుత ఫలితాన్ని ఇచ్చాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో నిష్ణాతుడిగా పేరు పొందారు. అయితే కేసీఆర్ తీరు నచ్చక విమర్శలు చేయడంతో ఆయనను లూప్ హోల్ పోస్ట్ కు బదిలీ చేశారు. దీంతో పనిలేని ఆ శాఖను చూడనంటూ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. అనంతరం ఈయన తెలివితేటలు గమనించి జగన్ విద్యాశాఖ సలహాదారుగా తీసుకొని ఇప్పుడు అక్కడ విద్యాసంస్కరణలు చేసి దేశవ్యాప్తంగా మంచి పేరు జగన్ కు వచ్చేలా చేశాడు

ఈ టాలెంటెడ్ రిటైర్డ్ ఐఏఏస్ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యావిధానం, కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులపై ఇంజనీర్ ఐఏఎస్ ఆకునూరి మురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన కీలక రంగాలపై మురళి తన ఆలోచనలు పంచుకున్నారు.

తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా, నిధులు ఇవ్వకున్నా, కేసీఆర్ సర్కారు సొంతంగా అప్పులు చేసి మరీ దాదాపు రూ. లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, దాని ద్వారా సుమారు 50 లక్షల ఎకరాలకు సాగనీరు అందిస్తున్నామని చెప్పడం తెలిసిందే.

అసలు కాళేశ్వరం దొంగ స్కీం అని.. కమీషన్ల కోసం రూపొందిన ప్రాజెక్ట్ అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. ప్రపంచంలోనే మూర్ఖపు ప్రాజెక్టుగా, తెల్ల ఏనుగులా మారిన కాళేశ్వరాన్ని నిర్వహించలేమని .. ఐదేళ్లలోపే దాన్ని మూసేయక తప్పదని ఆయన అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ డీపీఆర్ డిజైన్ చేసినప్పుడు రూ.36 లక్షల కోట్లు ప్రతిపాదించాడని.. ఆ తర్వా దాన్ని 42 లక్షల కోట్లు చేశాడని.. ఇప్పుడు లక్ష కోట్లు దాటిందని.. ఇదంతా కూడా మూడు నాలుగు సార్లు ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు సంపాదించాడని.. ఇది కేసీఆర్ వేసిన స్కెచ్ అని రిటైర్డ్ ఐఏఎస్ మురళీ ఆరోపించారు. కాళేశ్వరం 15 లక్షల ఎకరాలు పారుతుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు.

ప్రపంచంలోనే ఇంత మూర్ఖపు ప్రాజెక్టు ఇంకొకటి లేదని.. ఎకరా వరికి నీరు పారించాలంటే దీనికయ్యే కరెంట్ ఖర్చు రూ.50 వేలు అని మురళీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికీ తెల్ల ఏనుగు అని.. ఇంకో ఐదేళ్లలో దాన్ని మూసేయాల్సి వస్తుందని మురళీ స్పష్టం చేశారు.

దళితుల ఓట్ల కోసమే దళితబందు అని.. దళితుల ఉన్నతికి ఈ బంధు ఏమాత్రం పనికి రాదని మురళీ స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 100 మందికి చొప్పున దళితబంధు ఇవ్వాలంటే రాష్ట్రంలోని 18 లక్షల మందికి వచ్చేసరికి 156 ఏళ్లు పడుతుందన్నారు. ఫాంహౌస్ లు ఉన్న సినిమా సెలబ్రెటీలు, సివిల్స్ ఇతర ఉన్నతాధికారులకు రైతు బంధు డబ్బులు పడుతున్నాయంటే అదెంత వృథా స్కీమో అర్థం చేసుకోవచ్చని మురళీ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో విద్యావ్యవస్థను కేసీఆర్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేస్తున్నదని మురళీ ఆరోపించారు. రాష్ట్రంలో 12వేల కోట్లు టీచర్ల జీతాలు ఇస్తున్నారని.. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.40-45వేలు ఖర్చు పెడుతున్నారని.. అదే ప్రైవేటు స్కూళ్లలో రూ.7వేలు ఖర్చు పెడుతున్నారని.. వారిలో 90శాతం ఏ గ్రేడ్ వస్తే.. ప్రభుత్వ స్కూళ్లలో 63శాతం సీగ్రేడ్ వస్తోందని ఆరోపించారు. నాణ్యమైన విద్య విషయంలో కేసీఆర్ కనీసం ఐదు నిమిషాలు సమీక్ష నిర్వహించడం లేదని విమర్శించారు.

పేదలకు కావాల్సింది విద్య, వైద్యం అని.. వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని మురళీ ఆరోపించారు. తెలంగాణ రాకముందు 11శాతం బడ్జెట్ ఉంటే.. ఇప్పుడు కేసీఆర్ 6.2 శాతానికి తగ్గించాడని.. చిత్తశుద్ధి ఉంటే జిల్లాకు ఒక యశోద, కేర్, అపోలో ఆస్పత్రి కట్టవచ్చని.. కానీ కేసీఆర్ చేయడం లేదని మురళీ ఆరోపించారు.

మురళీ పచ్చి నిజాలతో కేసీఆర్ పై ఆధారాలు, సంఖ్యలతో చేసిన ఆరోపణలు వైరల్ అయ్యాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో కలెక్టర్ గా చేయడంతో ఈయన ఆరోపణలకు కాస్త విశ్వసనీయత ఉంది. అందుకే ప్రస్తుతం మురళీ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ , తెలంగాణ విద్యా, వైద్య రంగాలపై మురళీ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్లు ఇస్తుందన్నది వేచిచూడాలి.