Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు భేష్ అంటూ కథనం..రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   26 Feb 2020 2:10 PM GMT
మూడు రాజధానులు భేష్ అంటూ కథనం..రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
X
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం నిత్యం చర్చల్లో నిలుస్తోంది. ఏపీ లోని వైసీపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు సమర్దిస్తుంటే - మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ నూతన ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై సంచలన కథనాన్ని ప్రచురించింది రాయిటర్స్. ఈ కథనంలో పాలనా వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ - జగన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం భేష్ అన్నట్లుగా కొన్ని అంశాలను వివరించింది.

పాలనా వికేంద్రీకరణ జరగడం వల్ల అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్న రాయిటర్స్.. రాజధాని తరలింపు అనేది పక్కా ప్రణాళికతో జరగాలని అభిప్రాయపడింది. రాజధాని కార్యాలయాల తరలింపు అనేది పక్కా ప్రణాళికతో జరిగినపుడు మాత్రమే మెరుగైన ఫలితం ఉంటుందని తెలిపింది. ఇలా పరిపాలన వ్యవస్థను వికేంద్రీకరించడం కొత్తేమీ కాదని పేర్కొంటూ.. రాజధానిలోనే చట్టసభలు - సచివాలయం - హైకోర్టు అన్నీ ఒకే చోట ఉండాలనే నిబంధన ఏమీ లేదని తెలపడం విశేషం. పైగా ఈ వికేంద్రీకరణ వల్ల లాభమే తప్ప నష్టం లేదని తన కథనంలో పేర్కొంది రాయిటర్స్.

అంతేకాదు పాలనా వికేంద్రీకరణ జరిగితే ఇంతకాలం ఒకే రాజధానిగా ఉన్న నగరాల్లో రద్దీ తగ్గుతుందని - అలాగే కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి - ప్రాంతీయ అసమతుల్యతలను పరిష్కరించడానికి వికేంద్రీకరణే సరైన నిర్ణయం అని రాయిటర్స్ ఈ కథనంలో అభిప్రాయపడింది. కాగా ఇటీవల కియా మోటర్స్ తరలింపు విషయమై ప్రతిపక్షాలు దాడి చేసేలా కథనం రాసిన రాయిటర్స్.. ఇప్పుడు జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.