Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో మ‌రో కింగ్ మేక‌ర్...బీజేపీకి మ‌ద్ద‌తు!

By:  Tupaki Desk   |   15 May 2018 12:13 PM GMT
క‌ర్ణాట‌క‌లో మ‌రో కింగ్ మేక‌ర్...బీజేపీకి మ‌ద్ద‌తు!
X
క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ ప‌రిణామాలు సినీ ఫ‌క్కీలో క్షణక్షణానికి మారిపోతున్నాయి. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించే రీతిలో తీవ్ర‌ ఉత్కంఠను రేపుతున్నాయి. తాను కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని, ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధ‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ కు జేడీఎస్ ఎమ్మెల్యే కుమార‌స్వామి లేఖ కూడా రాశారు. ఇక క‌న్న‌డ నాట బీజేపీ స‌ర్కార్ లేన‌ట్లేన‌ని భావిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ తో పాటు కుమార స్వామికి బీజేపీ షాక్ ఇచ్చింది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని భావించిన బీజేపీ....చివ‌ర‌కు జేడీఎస్ ను నిట్ట‌నిలువునా చీల్చేందుకు సిద్ధ‌మైంది. త‌మ‌కు దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణతో పాటు 12 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుంద‌ని, ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తినివ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను య‌డ్యూర‌ప్ప కోర‌డం క‌న్న‌డ‌నాట సంచ‌ల‌నం రేపింది. కాసేప‌టి క్రితం గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయిన య‌డ్యూర‌ప్ప గ‌వ‌ర్న‌ర్ తో ఇదే విష‌యం చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రేవణ్ణకు 12మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అధికార దాహంతో క‌న్న‌డ నాట బీజేపీ కుటిల రాజ‌కీయాల‌కు తెర‌తీసింది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు జేడీఎస్ ను మూడు ముక్క‌లుగా చేసేందుకు కూడా బీజేపీ సిద్ధ‌మైంది. దీంతో, జేడీఎస్ ఎమ్మెల్యేలు......దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణ వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఈ చీలిక జ‌ర‌గ‌కుండా కుమారస్వామి తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌న సోద‌రుడిని బుజ్జ‌గించేంద‌కు కుమార‌స్వామి య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు, బీజేపీకి రేవ‌ణ్ణ‌ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ రోజు సాయంత్రం 5.30 కు గ‌వ‌ర్న‌ర్ తో కుమార స్వామి భేటీ కాబోతున్నారు. అయితే, అనూహ్యంగా 5 గంట‌ల‌కు య‌డ్యూర‌ప్ప‌కు గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయిన య‌డ్యూర‌ప్ప‌....రేవ‌ణ్ణ మ‌ద్ద‌తు తో స‌ర్కార్ ఏర్పాటు కు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని, అతి పెద్ద పార్టీగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని య‌డ్యూర‌ప్ప అన్న‌ట్లు తెలుస్తోంది.