Begin typing your search above and press return to search.

జూపల్లి, కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది: రేవంత్

By:  Tupaki Desk   |   29 Feb 2020 4:45 AM GMT
జూపల్లి, కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది: రేవంత్
X
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన స్నేహితుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని హైకోర్టుకెక్కారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది.

ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తనకు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రాణహాని ముప్పు పొంచి ఉందని రేవంత్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటీషన్ లో పేర్కొన్నాడు. కేసీఆర్ తనను వ్యక్తిగతం కూడా శత్రువుగా భావిస్తున్నాడని పిటీషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్, ఆయన సన్నిహితుల భూ అక్రమాలపై పోరాడుతున్నందుకు తన ప్రాణహాని ఉందన్నారు. జూపల్లి రామేశ్వరరావు కు హైదరాబాద్ లో అప్పనంగా భూ కేటాయింపులు చేయడంపై తాను హైకోర్టులో పోరాడుతున్నానని.. కేసీఆర్, జూపల్లి ఇద్దరూ తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఒకసారి ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని.. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

కేంద్ర ప్రభుత్వం లేదంటే.. స్వతంత్ర ఏజెన్సీ నుంచి తనకు 4+4 భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి న్యాయ స్థానాన్ని అభ్యర్థించారు. గతంలో తనకు 3+3 గన్ మెన్ రక్షణ ఉండేదని.. కేసీఆర్ సర్కారు కావాలనే కక్ష పూరితంగా దాన్ని 2+2కు తగ్గించినట్టు రేవంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు.

ఈ సందర్భంగా తన ప్రాణాలకు హాని ఉండడంతో భద్రత పెంచాలని కోరుతూ 2019, ఆగస్టు28న కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని హైకోర్టుకు తెలిపారు.

అయితే కేంద్రం స్పందించకపోవడం.. కేసీఆర్ సర్కారు పట్టించుకోకపోవడం వల్లే తాను హైకోర్టును ఆశ్రయించిన్నట్టు రేవంత్ పేర్కొన్నారు.

ఈ పిటీషన్ లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, జూపల్లి రామేశ్వరరావులను రేవంత్ రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు.