Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ అంబేడ్కర్ భవన్.. కేసీఆర్ కు రేవంత్ భారీ వార్నింగ్ లు

By:  Tupaki Desk   |   26 Aug 2021 4:51 AM GMT
ప్రగతిభవన్ అంబేడ్కర్ భవన్.. కేసీఆర్ కు రేవంత్ భారీ వార్నింగ్ లు
X
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలో 48 గంటల పాటు చేసిన దీక్షను ముగించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ను కూడా వదల్లేదు. అంతేకాదు.. ‘కేసీఆర్.. నీ టైమ్ అయిపోయింది. తట్టాబుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చింది’ అంటూ ఘాటు విమర్శలు చేసిన రేవంత్ మరింత మంట పుట్టే వ్యాఖ్యలు చేశారు. అవేమంటే..

- సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు కోతుల గుంపులా దోచుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పడిన కష్టం కంటే అధికంగానే ప్రజలు ఆయనకు ఇచ్చారు. ఇంకా ఇవ్వడానికి తెలంగాణ సమాజం వద్ద ఏముంది?

- కేసీఆర్‌.. నీ టైమ్‌ అయిపోయింది. తట్టాబుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సమయం వచ్చింది. కేసీఆర్‌ ముందు పుట్టారా? మోసం ముందు పుట్టిందా? అంటే చెప్పటం కష్టం. తెలంగాణ కోసం ఆయన పడిన కష్టం కంటే ఎక్కువ కూలీ దక్కింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొందరే బాగుపడ్డారు. టైమొస్తే.. బీసీ.. మైనార్టీ.. బ్రాహ్మణులకు ‘బంధు’ ఇస్తామని సీఎం చెబుతున్నారు. కానీ.. కేసీఆర్ టైం అయిపోయింది. ఇక ఆయన ఇంటికే ఇప్పుడు తెలంగాణ సమాజానికి టైం వచ్చింది.

- ఇంద్రవెల్లి, మహేశ్వరం, మూడుచింతలపల్లిలో కాంగ్రెస్‌ ఆందోళనలను జపాన్‌ ఎలుక మాదిరిగా కేసీఆర్‌ ముందే పసిగట్టారు. అందుకే ఫాంహౌస్‌ వదిలి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆ ఎలుకను బోనులో బంధించాల్సిన అవసరం ఉంది. త్వరలో గజ్వేల్‌లో మీటింగ్‌ పెట్టి అధికార పార్టీని నిలదీస్తా.

- కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ బహుజన భవన్‌గా మారుస్తాం. కాంగ్రెస్‌ అఽధికారంలోకి రాగానే ఎవరు సీఎం అయినా తొలి సంతకం దీనిపైనే పెడతాం. దళిత, గిరిజన, బహుజన బిడ్డల కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తాం. దానిని దళిత.. గిరిజన.. ఆదివాసీల పిల్లలను డాక్టర్లు.. ఇంజినీర్లు.. ఐఏఎస్.. ఐపీఎస్ లు ఉత్పత్తి చేసే కర్మాగారంగా చేస్తాం. దేశంలో ఐఏఎస్.. ఐపీఎస్ లు ఎక్కువగా తెలంగాణ నుంచే వచ్చేలా చూస్తాం.

- నాకు ఎలాంటి కోరికలు లేవు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. కాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన వ్యక్తితో దళిత.. గిరిజన.. ఆదివాసీల విద్యకు ప్రత్యేక బడ్జెట్ కోసం సంతకం పెట్టిస్తాం.

- హుజురాబాద్‌లో అయ్య గెలుస్తామంటున్నాడు... కొడుకు మాత్రం గెలిస్తే ఎంత? ఓడితే ఎంత? అంటున్నాడు... అయ్య చెప్పిందంతా అబద్ధమేనని చెబుతున్నాడు.. అంటే విషయం వాళ్లకు అర్ధమైనట్టుంది.

- ఒకవైపు కేసీఆర్‌ కుటుంబం.. మరోవైపు మంత్రి మల్లారెడ్డి కుటుంబం కలిసి బంగారు తెలంగాణను కంగారు తెలంగాణగా మార్చారు. మేడ్చల్ ప్రాంతంలో ఎవరు భూములు అమ్మినా..కొన్నా మంత్రికి కమిషన్లు ఇవ్వాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా. కబ్జాలతో ఆక్రమించిన.. అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి మెడికల్ .. ఇంజీనీరింగ్ కాలేజీలు.. జవహనర్ నగర్ దవాఖానా.. వర్సిటీ భూములపై విచారణ జరిపించాలి. నేను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే.. ముఖ్యమంత్రి వేసే ఏ శిక్ష కైనా సిద్ధం. మల్లారెడ్డి అవినీతిపై ఊరూరా తిరిగి ప్రచారం చేస్తా.