Begin typing your search above and press return to search.

ఇది అఫ్గానిస్థానా లేదా ఉత్త‌ర కొరియానా?

By:  Tupaki Desk   |   31 Dec 2021 7:36 AM GMT
ఇది అఫ్గానిస్థానా లేదా ఉత్త‌ర కొరియానా?
X
తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌రోసారి సీఎం కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. వ‌రంగ‌ల్ జిల్లా శాయంపేట‌లో నేడు ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌కుండా రేవంత్‌ను పోలీసుల అడ్డుకోవ‌డంతో ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద‌యాన్నే త‌న ఇంటిని ముట్ట‌డించిన పోలీసులు రేవంత్ బ‌య‌ట‌కు రాకుండా ఇంట్లోనే నిర్బంధించారు. ఆయ‌న్ని హౌస్ అరెస్టు చేశారు. దీంతో రేవంత్ కేసీఆర్‌పై మండిప‌డ్డారు.

తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న న‌డుస్తుంద‌ని రేవంత్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు. రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌నీయ‌కుండా మ‌రోసారి పోలీసుల త‌న‌ను నిర్బంధించార‌ని ఇది అఫ్గానిస్థానా లేదా ఉత్త‌ర కొరియానా? అని రేవంత్ ప్ర‌శ్నించారు. 2021 ఏడాది ముగింపున‌కు వ‌చ్చిన‌ట్లుగానే ఈ టీఆర్ఎస్ ఆరాచ‌క‌ పాల‌న‌కు కాంగ్రెస్ కూడా ముగింపు ప‌లుకుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి ఉద‌యాన్నే చేరుకున్న పోలీసులు ఇప్పుడ‌క్క‌డ గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. త‌న అనుమ‌తి లేకుండా పోలీసులు ఇంట్లోకి ప్ర‌వేశించ‌డంపై రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ హౌస్ అరెస్టు విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయ‌న నివాసం వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు.

ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో రేవంత్ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేద‌ని ఇప్ప‌టికే ఆయ‌న్ని ఎర్ర‌వెల్లి వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అదే కార‌ణంతో మ‌రోసారి హౌస్ అరెస్టు చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతు వ్య‌తిరేక విధానాల‌ను విమ‌ర్శిస్తూ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి రేవంత్ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రేవంత్‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ప్ర‌భుత్వ ప్రోత్స‌హంతో పోలీసులు అడ్డుకుంటున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. పౌర స్వేచ్ఛ‌ను కేసీఆర్ స‌ర్కారు హ‌త్య చేస్తోంద‌ని, ప్ర‌తిప‌క్ష‌ల నేత‌ల ఇళ్ల‌లోకి ఖాళీల‌ను ఉసిగొల్పుతున్నార‌ని రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు. స‌న్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్ల‌లో ప‌రామ‌ర్శ‌ల‌కు శుభ‌కార్యాల‌యాల‌కు వెళ్ల‌కుండా నిర్బంధిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ అంటే కేసీఆర్ వెన్నులో వ‌ణుకు పుడుతుంద‌ని రేవంత్ పేర్కొన్నారు.