Begin typing your search above and press return to search.

రేవంత్ లేకుంటే పార్టీ ముందుకు సాగదా

By:  Tupaki Desk   |   14 Jun 2022 1:30 AM GMT
రేవంత్ లేకుంటే పార్టీ ముందుకు సాగదా
X
బండి ఉన్నా నడిపేవారు లేకపోతే అంతే.. అన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. ప్రస్తుతమున్న పార్టీ అధ్యక్షుడు కొన్ని రోజులు లేకపోయే సరికి కాంగ్రెస్ గందరగోళంగా మారింది. రేవంత్ రెడ్డి లేకపోతే పార్టీని ముందుకు తీసుకెళ్లడం కష్టం అనే వాదన వినిపిస్తోంది. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నారు. తల పండిన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఎవరికి వారే అన్నట్లుగా మారారు. పార్టీకోసం పనిచేయాలన్న తపన ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం నీరుగారుతోంది. ఫైనల్ గా రేవంత్ రెడ్డి లేకపోతే పార్టీ పరిస్థితి అయోమయం అన్న విధంగా తయారైందని అంటున్నారు.

కొన్ని రోజులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు వెళ్లారు. ఆయన వెళ్లిన కాలంలో రాష్ట్రంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని బీజేపీ వినియోగించుకుంటోంది. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరూ నోరు మెదపడం లేదు. అడపాదడపా కొందరు నాయకులు ఆందోళన చేస్తున్నా బీజేపీని బీట్ చేయలేకపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ రేప్ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో సీనియర్లు ఎంతో మంది ఉన్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.

ఇక తాజాగా నిర్వహించిన చింతన్ శిబిరాల్లో రేవంత్ రెడ్డి లేరు. దీంతో కార్యకర్తల్లో అంత ఊపు కనిపించడం లేదు. భట్టి విక్రమార్క లాంటి నేతలున్నా పదునైన ప్రసంగాలు వినిపించలేదు. రేవంత్ రెడ్డి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని కొందరు అంటున్నారు. యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న రేవంత్ పార్టీ చీఫ్ గా ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుతున్నారు. అయితే రేవంత్ మాత్రమే చేయడం వల్ల అన్ని ప్రాంతాల్లో పార్టీ ఆకట్టుకోలేకపోతుంది. ఓ వైపు పార్టీ కోసం ఆయన రకరకాల ప్లాన్ వేస్తుంటే పార్టీలోని కొందరు నాయకులు ఆయన మాట వినడం లేదు. ఆయన చెప్పింది చేయకుండా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ఆయన తన అనుచర గణంతో కలిసి ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరారు. అయితే ఆ సమయంలో ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. అయినా సొంత ప్రాబల్యంతో ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఘోర పరాభావం చెందిన కాంగ్రెస్ కొన్ని రోజుల తరువాత నైనా బాగుపడుతుందని అధిష్టానం వేచి చూసింది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన దూకుడు పెంచారు. పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒంటరి పోరాటం చేయడం వల్ల బీజేపీని బీట్ చేయలేకపోతుంది.

బీజేపీలో పార్టీ అధ్యక్షుడితో పాటు మిగతా నాయకులు తమదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. లోపాలను ఎత్తిచూపుతూ ఇరుకున్న పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రజాలోకం కమలం వైపు చూస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్లో కూడా సీనియర్లంతా కలిసిరావాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఒక్కడే పోరాటం చేస్తేనే పార్టీ బాగుపడుతుందన్న భావన నుంచి బయటికి రావాలి. వ్యక్తిగతంగా పార్టీ కోసం పనిచేస్తే సమిష్టిగా లాభాలు వస్తాయని అనుకోవాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరడానికి మార్గం దొరుకుతుంది.