Begin typing your search above and press return to search.

ఒకేసారి కారుకు.. కమలానికి షాకిచ్చేలా రేవంత్ ప్లానింగ్

By:  Tupaki Desk   |   18 Aug 2021 12:30 AM GMT
ఒకేసారి కారుకు.. కమలానికి షాకిచ్చేలా రేవంత్ ప్లానింగ్
X
సాధారణంగా ఎన్నికలు మరో ఏడాదిలో ముంచుకొస్తున్నాయంటే రాజకీయ హడావుడి మామూలే. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏడాదిన్నర.. రెండేళ్ల ముందు నుంచే ఇప్పుడు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు.తాజాగా ఈ దూకుడు మరింత ఎక్కువగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ముప్ఫై నెలలకు పైనే సమయం ఉంది. ఇంత సుదీర్ఘకాలం తర్వాత జరిగే ఎన్నికలకు రాజకీయ పార్టీలు హడావుడి చేయటం ఉండదు.కానీ.. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షంతో పాటు.. విపక్షాలైన కాంగ్రెస్ .. బీజేపీలు తమ ఇమేజ్ ను పెంచుకోవటానికి విపరీతంగా శ్రమిస్తున్నాయి. ఎవరికి వారు.. తమ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్నారు.

దీంతో తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ అంతకంతకూ వేడెక్కుతున్నాయి. తెలంగాణ ప్రజల్లో తమ ఇమేజ్ ను పెంచుకోవటంతో పాటు.. కేసీఆర్ కు సరైన ప్రత్యామ్నాయం తామేనన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు పార్టీలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. దేశంలో మరే రాష్ట్రంలోలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యర్థులకు ఊహించని షాకిచ్చారు.ఈ పథకం తీరు చూస్తున్న వారికి నోట మాట రావటం లేదు. అయితే.. అనుకున్నంత తేలిగ్గా లేని ఈ పథకం కేసీఆర్ తనకు తానే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ అధికారపక్షానికి ధీటుగా కాంగ్రెస్.. బీజేపీలు తమ రాజకీయ ఎత్తుల్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు మధ్యలోకి అనూహ్యంగా వచ్చిన షర్మిల కూడా తన రాజకీయ కార్యాచరణను వెల్లడించటం తెలిసిందే. రెండు పార్టీలతో పాటు.. తాను కూడా పాదయాత్రను చేపడతానన్న విషయాన్ని ఆమె ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. షర్మిల.. బండి సంజయ్ లు చేస్తామని చెబుతున్న పాదయాత్రలకు పోటీగా తాను ఇప్పటికిప్పుడు ఆ పని చేయకూడదన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు భిన్నంగా వ్యూహాత్మక ఎత్తుగడతో కొన్ని ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్ని నిర్వహించటం ద్వారా.. కేసీఆర్ పార్టీని దెబ్బ తీయాలన్న ఆలోచనతో ఉన్నారు.

ఇందుకు తగ్గట్లే ఇంద్రవెల్లిలో ఆయన చేపట్టిన దళిత గిరిజన దండోర సభ సక్సెస్ కావటమే కాదు.. ఆయన చెప్పినట్లే లక్షకు పైగా జనాల్ని సభకు తీసుకురావటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దళితబంధు పథకాన్నిఅమలు చేస్తున్న కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్న రేవంత్.. తన వాదనను ఇంద్రవెల్లి సభలో వినిపించారు. ఈ సభ సక్సెస్ కావటంతో.. తర్వాత చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో సభను నిర్వహించి.. మూడో సభను మెదక్ ఎంపీ స్థానం పరిధిలో నిర్వహించాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ సభకు సంబంధించి తాజాగా కొన్ని వివరాలుబయటకు వచ్చాయి. కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని చూస్తే.. తన మూడో సభను కేసీఆర్ సొంత ఇలాకా గజ్వేల్ లో దళిత.. గిరిజన దండోరా సభను నిర్వహించాలన్నది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి భారీ వ్యూహమే ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ సభను ఈ నెల24న నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను షురూ చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదంతా చూస్తుంటే.. బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజునే రేవంత్ తన భారీ బహిరంగ సభను.. కేసీఆర్ ఇలాకాలో నిర్వహించాలని డిసైడ్ కావటం చూస్తుంటే.. ఆయన కొత్త లెక్కల్లో ఉన్న విషయం ఇట్టే అర్థమువుతంది. ఈ సభను సక్సెస్ చేస్తే ఆయనకు వచ్చే ప్రయోజనాలు రెండు అని చెప్పక తప్పదు. ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కంటే రేవంత్ ఇమేజ్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని నిరూపించటం..ముఖ్యమంత్రి ఇలాకాలో సభను నిర్వహించి సక్సెస్ చేయగలిగితే.. ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ ఖాతాలోనే పడుతుంది. ఇలా ఒకే నిర్ణయంతో రెండు ప్రధాన పార్టీలకు రేవంత్ తనదైన రీతిలో షాకిస్తున్నాడన్న మాట వినిపిస్తోంది. మరి.. ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది తేలాలంటేఆగస్టు 24 వరకు వెయిట్ చేయాల్సిందే.