Begin typing your search above and press return to search.

కన్నీరుపెట్టుకున్న రేవంత్.. కుట్ర జరుగుతుందంటూ బరస్ట్

By:  Tupaki Desk   |   21 Oct 2022 4:02 AM GMT
కన్నీరుపెట్టుకున్న రేవంత్.. కుట్ర జరుగుతుందంటూ బరస్ట్
X
రాజకీయ ప్రత్యర్థులపై అలుపెరగని పోరాటం చేసే నేతగా.. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా రేవంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ అందరికి తెలిసిందే. అలాంటి ఆయన్ను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఆయన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి తెలిసిందే. నిజానికి టీపీసీసీ పదవి రేవంత్ కు దక్కిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీలో చలనం రావటమే కాదు..పలు సందర్భాల్లో అధికారపార్టీకి ధీటుగా సమరశీలతను ప్రదర్శించటాన్ని మర్చిపోలేం.

తెలంగాణలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో చైతన్యంగా ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి తప్పించి మరొకరు కాదు. పార్టీలో సుదీర్ఘంగా ఉంటూ కూడా పార్టీని బొంద పెట్టేసే నేతలు కొందరు అయితే.. మరికొందరు చూస్తూ ఉండిపోవటం మినహా మరేమీ చేయని చేతకానితనంతో వ్యవహరించినోళ్లు ఉన్నారు. ఇందుకు భిన్నంగా పార్టీ కోసం రేవంత్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. బయట ప్రత్యర్థులతో పోరాడే విషయంలో వెనక్కి తగ్గని రేవంత్.. సొంత పార్టీ నేతలు అదే పనిగా తనపై చేస్తున్న కుట్రలు.. కుతుంత్రాలకు అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని కొందరు నేతల వ్యవహారశైలి.. కేసీఆర్ అండ్ కో పన్నుతున్న కుట్రల గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే..

- నన్ను ఒంటరివాన్ని చేశారు. నా మీద కక్ష ఎందుకు? పీసీసీ పదవి కోసం ఇంత కక్షా? (భావోద్వేగంతో . కన్నీటి పర్వంతమవుతూ) నన్ను అభిమానించే వాళ్లకు.. కార్యకర్తలకు.. పార్టీ శ్రేణులకు నేను నా మనసులో బాధ చెబుతున్నా. నన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతుంది.

- కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బిజెపి.. కెసిఆర్ కలిసి కుట్ర చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు కేసీఆర్ సుపారి తీసుకున్నాడు. పది రోజుల పాటు ఢిల్లీలో ఉండి అమిత్ షా.. నరేంద్ర మోడీతో రహస్య మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్.. అమిత్ షా ఆడుతున్న డ్రామాలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక.

- కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ బలగాలతో మునుగోడును చుట్టి ప్రజలను కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులు కేసీఆర్ కు కొమ్ము కాస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా నియంతల వ్యవహరిస్తున్నారు.

- కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందాం. మునుగోడుకు రండి. పార్టీని కాపాడుకుందాం. దివిసీమలా మన రాష్ట్రం కాకూడదు. లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యదక్షులు ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు మునుగోడుకు తరలిరావాలి. మన పార్టీని మనమే కాపాడుకుందాం. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి రేవంత్ రెడ్డిని పిసీసీ నుండి తొలగించాలని భారీ కుట్ర జరుగుతుంది. కార్యకర్తలు.. అభిమానులు.. ప్రజలందరూ గమనించాలి.

- రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకే మా సొంత పార్టీ నాయకులు కేసీఆర్ తో కలిసి కుట్ర చేస్తున్నారు. తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రండి. కదలిరండి. పోరాడుదాం. పార్టీని గెలిపిద్దాం. స్రవంతికి అండగా ఉందాం. మునుగోడు మనకు అన్నం పెడుతుంది ఎవరు చింతించకండి.

- పోలీసుల లాఠీల దెబ్బలకు ఎవరు భయపడొద్దు. ప్రాణాలైనా ఇద్దాం కాంగ్రెస్ పార్టీని బతికిద్దాం. లాటి దెబ్బలకైనా.. తూటాలకైనా తుపాకి గుండ్లకైనా నేను సిద్ధంగా ఉన్నా. ప్రాణాలు సైతం ఇచ్చేందుకు.. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా. రెండు అధికార పార్టీలు డబ్బులతో గెలుద్దామని చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి .అవకాశం ఇవ్వండి.

- మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టాలి ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కుట్రలు చేస్తున్న రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. పిసిసి అధ్యక్షుడిగా నన్ను తొలగించేందుకే సొంత పార్టీ నాయకులు భారీ కుట్ర చేస్తున్నారు. నాకు పిసిసి శాశ్వతం కాదు. సోనియాగాంధీ ఇచ్చిన అవకాశం మాత్రమే. పదవులు ఎవరికి శాశ్వతం కాదు.

- టీ పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిన నాటి నుంచి నాపై కేసీఆర్.. బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను ఒంటరి వాడిని అయి పోయా. రెండు ప్రభుత్వాల కుట్రల్ని తిప్పి కొడుతూ కార్యకర్తల కోసం పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.