Begin typing your search above and press return to search.

నిరసన చేస్తున్న బాసర విద్యార్థుల్ని కలవటం కోసం గోడ దూకిన రేవంత్

By:  Tupaki Desk   |   18 Jun 2022 6:34 AM GMT
నిరసన చేస్తున్న బాసర విద్యార్థుల్ని కలవటం కోసం గోడ దూకిన రేవంత్
X
గడిచిన నాలుగు రోజులుగా వేలాది మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శాంతియుతంగా నిరసనను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా సాగుతున్న సమస్యల పరిష్కారానికి వారు గళం విప్పారు. వారి సమస్యల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. పరిష్కరించటం పెద్ద విషయం కాదన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇంత మంది విద్యార్థులు ఎండకు ఎండుతూ నిరసన చేస్తున్నా.. తెలంగాణ అధికారపక్షం ఇప్పటివరకు ఈ అంశంపై సానుకూలంగా స్పందించింది లేదన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనకు రాజకీయ పక్షాల మద్దతు కూడా లభిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీజేపీ తమ మద్దతు తెలియజేశారు. అంతేకాదు.. వీరి నిరసనపై చాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ తమిళ సై సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ నిరసన తెలియజేస్తున్న విద్యార్థుల్ని చూస్తే.. తనకు బాధ కలుగుతుందని గవర్నర్ వాపోయారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక ట్వీట్ చేశారు.

విద్యార్థులు ఇంకా భవిష్యత్ లక్ష్యాల్ని చేరుకోవాల్సి ఉందని.. మీ తల్లిదండ్రుల కలలు నెరవేర్చాల్సి ఉందన్నారు. అందుకే పిల్లలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం తాను చేస్తానని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిరసన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్ని కలుసుకోవటం.. వారికి మద్దతు ప్రకటించటం కోసం తెలంగాణ కాంగ్రెస్ రథసారధి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన చర్య చేశారు.

ట్రిఫుల్ ఐటీ విద్యార్థుల్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆయన వినూత్నమైన ప్లాన్ వేశారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ వెళ్లిన రేవంత్.. సీక్రెట్ గా క్యాంపస్ గోడ దూకి మరీ లోపలకు ప్రవేశించారు.

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు వెళ్లి వారి గోడు వినడానికి వెళ్లడానికి కాస్త ముందుగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్టు చేయటం అక్రమమని రేవంత్ మండిపడ్డారు. ఏమైనా.. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తన మద్దతు చాటేందుకురేవంత్ చేసిన సాహస చర్య హాట్ టాపిక్ గా మారింది.