Begin typing your search above and press return to search.

కేసీయార్ కాంగ్రెస్ కి కొత్త దోస్తా... రేవంత్ ఏమంటున్నారు...?

By:  Tupaki Desk   |   8 Sep 2022 2:40 PM GMT
కేసీయార్ కాంగ్రెస్ కి కొత్త దోస్తా... రేవంత్ ఏమంటున్నారు...?
X
పొత్తులు ఎత్తులు వ్యూహాలు ఇవన్నీ రాజకీయాలో ఒక భాగమైతే ఇపుడు వాటిని తలదన్నేలా కొత్తగా మరోటి వచ్చి చేరింది. దాని పేరే మైండ్ గేమ్. అంటే ప్రత్యర్ధి మైండ్ లో తమకు అనుకూలం అనుకునే ఒక విషయం కానీ వారు భయపడే విషయం కానీ ఒకటి చొప్పించి తద్వారా వారిని కార్నర్ చేసి అల్లల్లాడించడం అన్నమాట. ఇపుడు పాలిటిక్స్ లో ఈ ట్రిక్స్ బాగా ప్లే అవుతున్నాయి.

ఎన్నికలు దగ్గర చేసి చాలానే మైండ్ గేమ్స్ బయటకు వస్తాయి. అయితే ఇపుడు అలాంటిదే ఒక మైండ్ గేమ్ స్టార్ట్ అయిందా లేక అదే నిజమా అన్నట్లుగా టీయారెస్ తో కాంగ్రెస్ పొత్తు వ్యవహారం ఉంది. నిజానికి కాంగ్రెస్ తో టీయారెస్ ని విలీనం చేస్తారు అన్న షరతు మీదనే నాడు సోనియా గాంధీ తెలంగాణా రాష్ట్రాన్ని అనౌన్స్ చేశారని చెబుతారు. ఆ తరువాత కేసీయార్ ప్లేట్ ఫిరాయించి సొంతంగా పోటీ చేయడం రెండు సార్లు తెలంగాణాలో అధికారంలోకి రావడం జరిగాయి.

ఇపుడు ముచ్చటగా మూడవసారి కేసీయార్ తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్నారు. అయితే దానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయా అంటే ఎటూ చెప్పలేని స్థితి. ఈ నేపధ్యంలో కేసీయార్ కాంగ్రెస్ కి కొన్నాళ్ళు దూరం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య టీయారెస్ లో కాంగ్రెస్ మీద విమర్శలు తగ్గాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ని ఒక్క మాట కూడా టీయారెస్ అనడం లేదు. అదే తెలంగాణాలో మాత్రం లోకల్ లీడర్స్ మీద అపుడపుడు విమర్శలు ఉంటున్నాయి.

ఈ తేడాతో పాటు మరో ప్రచారం కూడా బయల్దేరింది. ఈ మధ్య నితీష్ కుమార్ వద్దకు ప్రత్యేక విమానం కట్టుకుని మరీ కేసీయార్ వెళ్ళి వచ్చారు. మరి ఈ ఇద్దరు నేతలు ఏమి మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ వెంటనే నితీష్ కుమార్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలసి మాట్లాడారు. దాంతో ఇపుడు కొత్త ప్రచారం తెలంగాణాలో స్టార్ట్ అయింది. కాంగ్రెస్ తో పొత్తు కోసం కేసీయార్ చూస్తున్నారని ఆయన తన మాటగా దాన్ని నితీష్ చెవిన వేస్తే ఆయన తరఫున నితీష్ ఢిల్లీ వెళ్ళి రాహుల్ తో దీని మీద మాట్లాడి వచ్చారని పెద్ద ఎత్తున పుకారు లాంటి ప్రచారం స్టార్ట్ అయింది.

మరి ఇది ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే దీని మీద తెలంగాణా రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. దాంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రనంలోకి వచ్చి పక్కాగా క్లారిటీ ఇవ్వక తప్పింది కాదు. ఆయన కాంగ్రెస్ తో టీయారెస్ పొత్తు అన్నవి వట్టి మాటని కొట్టిపారేశారు. అలా అసలు జరగదని కూడా పేర్కొన్నారు. రాహుల్ గాంధీయే స్వయంగా ఇదే విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ చేతులు కలుపుతుందని కలలో కూడా ఊహించలేని విషయం అన్నారు. అలాగే గత ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకుందని ఆయన్ విమర్శించారు. అలాంటి అవినీతిపరులతో చేతులు కలపడానికి మేం సిద్ధంగా లేమని కుండబద్ధలు కొట్టారు. ఈ విషయంలో వచ్చిన పుకార్లను ఎవరూ నమ్మడం లేదని కూడా అన్నారు.

మరో వైపు చూస్తే తెలంగాణాలో బీజేపీని పెంచి పోషించింది కూడా కేసీయారే అని తీవ్ర ఆరోపణ చేశారు. పట్టుమని పదిమంది నాయకులు కూడా లేని బీజేపీని తన ప్రధాన ప్రత్యర్ధిగా కేసీయార్ ఊహించుకోవడమే తప్పు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణాలో రెండంకెల సీట్లు కూడా రావు అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

అదే విధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్టోబర్ లో తెలంగాణాలోకి ఎంట్రీ ఇస్తుందని ఆయన చెప్పారు. బీజేపీ దేశాన్ని విభజన రాజకీయాలతో ముక్కలు చేస్తూంటే దేశమంతా ఒక్కటి అని కలపడమే రాహుల్ భారత్ జోడో యాత్ర అని ఆయన అన్నారు. రాహుల్ యాత్ర తెలంగాణాలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే మొత్తానికి మొత్తం రాజకీయ ముఖచిత్రం మారుతుంది ని రేవంత్ గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే కేసీయార్ తో చేతులు కలపడం కల అన్న రేవంత్ మాటలు మాత్రం ప్రస్తుతానికి నిజమనుకోవాలి. కానీ ఇది రాజకీయం తెర వెనక ఏమి జరుగుతుందో ఎవరూ ఎరగరు కాబట్టి కాస్తా బుర్రకు పనిచెప్పి ఆలోచించాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.