Begin typing your search above and press return to search.

ఇంతకీ ఆ చిట్‌ఫండ్‌ సంస్థ ఎవరిది..?

By:  Tupaki Desk   |   27 Jun 2015 8:02 AM GMT
ఇంతకీ ఆ చిట్‌ఫండ్‌ సంస్థ ఎవరిది..?
X
ఓటుకు నోటు వ్యవహారంలో అత్యంత కీలకమైన రూ.50లక్షలు ఎక్కడ నుంచి వచ్చాయి.. ఎవరి ఖాతా నుంచి వచ్చాయన్న విషయం ఇంకా తేలని విషయం తెలిసిందే. తొలుత బంజారాహిల్స్‌లోని ఒక బ్యాంకు నుంచి వచ్చాయని.. ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన అకౌంట్‌ నుంచి వచ్చినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే. దీనిపై కొన్ని మీడియాల్లో విపరీతమైన వార్తలు వచ్చాయి.

అయితే.. వీటిని ఖండించిన సీఎం రమేష్‌.. తనకు సదరు బ్యాంకులో ఖాతా లేదని చెప్పటమే కాదు.. తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వచ్చినట్లుగా తేలితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ అది తప్పు అయితే.. మీడియా సంస్థను మూసేస్తావా? అంటూ సదరు మీడియా సంస్థ ప్రతినిధిపై విరుచుకుపడటం తెలిసిందే.

అయితే.. మొదట అనుకున్నట్లుగా జూబ్లీహిల్స్‌లోని బ్యాంకు నుంచి కాదని.. అమీర్‌పేటలోని ఒక చిట్‌ఫండ్‌ కంపెనీ నుంచి డబ్బులు వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. అమీర్‌పేటలోని ఆ చిట్‌ఫండ్‌ కంపెనీ వివరాలు మాత్రం బయటకు పొక్కని పరిస్థితి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదరు చిట్‌ ఫండ్‌ కంపెనీ యజమాని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అతనికి ఫైనాన్స్‌ వ్యాపారం కూడా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఆ చిట్‌ఫండ్‌ కమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ యజమాని ఎవరు? ఏమిటన్న విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మరి.. ఈ విషయాలు ఎప్పటికి బయటకు వస్తాయో..?