Begin typing your search above and press return to search.

కేసీఆర్ మనసులో ఉన్నది ఇదేనంటూ జోస్యం చెప్పిన ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   19 Jan 2023 7:42 AM GMT
కేసీఆర్ మనసులో ఉన్నది ఇదేనంటూ జోస్యం చెప్పిన ఫైర్ బ్రాండ్
X
తెలంగాణ అసెంబ్లీని షెడ్యూల్ కంటే ముందుగానే రద్దు చేయాలన్న ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నారా? ఆ దిశగా ఆయన ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ రద్దుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారా? అంటే.. దేనికి తెలీదన్న మాట తప్పించి.. అవును జరిగే అవకాశం ఉందన్న మాట చెప్పే అవకాశం లేదు. అయితే.. ఈ తరహా ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇస్తూ రాజకీయంగా వేడిపుట్టిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ వ్యూహాల్ని నిశితంగా పరిశీలిస్తే.. ఫిబ్రవరి చివర్లో అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ లోపే ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించటం కోసం డిసెంబరులో జరగాల్సిన శీతాకాల సమావేశాల్ని కేసీఆర్ నిర్వహించలేదన్న రేవంత్.. నిబంధనల ప్రకారం అసెంబ్లీ సమావేశాల్ని ఆర్నెల్ల లోపు నిర్వహించకుంటే అసెంబ్లీ రద్దు అవుతుందన్నారు.

వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 13న ముగిశాయని.. శీతాకాల సమావేశాల్ని నిర్వహించకపోవటతో మార్చి 15 నాటికి ఆర్నెల్ల గడువు పూర్తి అవుతుందని.. దాంతో కేసీఆర్ సర్కారుకు కాలం చెల్లుతుందన్న మాట రేవంత్ నోటి నుంచి వచ్చింది. కేసీఆర్ మనసులోని ఆలోచనల ప్రకారమైతే.. ఫిబ్రవరిలో చివరికి తెలంగాణ అసెంబ్లీ రద్దు అయి.. ఎన్నికల దిశగా అడుగులు పడుతాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లుగా ఫైర్ బ్రాండ్ పేర్కొన్నారు.

ఫిబ్రవరి చివర్లో తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తమ పార్టీకి సంబంధించిన ఒక నేత కమ్ వ్యాపారవేత్తను తన ఫామ్ హౌస్ కు ముఖ్యమంత్రి కేసీఆరర్ పిలిపించుకున్నారన్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసుపై దాడి చేసిన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో 120-130 సీట్లను సొంతం చేసుకుంటుందన్న విషయాన్ని తెలుసుకున్నారన్నారు.

కాంగ్రెస్ గెలిచే సీట్లలో 20 నుంచి 30 సీట్లలో ఓడించేందుకు కాంగ్రెస్ కు చెందిన కీలక నేతతో బేరసారాలు ఆడినట్లుగాచెబుతున్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు సుపారీ పుచ్చుకున్నట్లుగా మండిపడ్డారు.

ఖమ్మం సభకు అందరూ వచ్చినా జేడీయూ కుమార స్వామి మిస్సింగ్ ఎందుకు? ఆయన ఎందుకు రాలేదో చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర తెలుసుకున్న కుమారస్వామి.. ఖమ్మం సభకు రాలేదన్నారు. మరి.. రేవంత్ చేసిన ఈ సంచలన ఆరోపణలకు బీఆర్ఎస్ అండ్ కో ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.