Begin typing your search above and press return to search.

యాదయ్య కుటుంబం కనిపించట్లేదా కేసీఆర్.. రేవంత్ సూటి ప్రశ్న

By:  Tupaki Desk   |   2 Sep 2022 4:06 AM GMT
యాదయ్య కుటుంబం కనిపించట్లేదా కేసీఆర్.. రేవంత్ సూటి ప్రశ్న
X
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సారధి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న సామెత మాదిరి సీఎం కేసీఆర్ తీరు ఉందని విరుచుకుపడ్డారు. తన రాజకీయ అవసరాలకు దేశవ్యాప్తంగా అమర జవాన్లు.. రైతు కుటుంబాలకు రాష్ట్ర ఖజానా నుంచి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణకు చెందిన యాదయ్య కుటుంబం కనిపించకపోవటంపై తీవ్రంగా మండిపడ్డారు.

అమర జవాన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగానే సానుభూతి ఉంటే.. 2013లో కశ్మీర్ లో ఉగ్రవాదుల తూటాలకు బలైన దళిత బిడ్డ.. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లెకు చెందిన మల్లెపాకుల యాదయ్య కుటుంబం ఎందుకు కనిపించలేదు? అని ప్రశ్నించారు.

యాదయ్య చనిపోయినప్పుడు సీఎం కుమార్తె కవిత ఆ కుటుంబాన్ని పరామర్శించారని.. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఐదు ఎకరాల భూమి.. ఇంటి స్థలం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

దాదాపు తొమ్మిదేళ్లు గడిచినా.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా.. దేశమంతా తిరిగి పప్పుబెల్లాల మాదిరి తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని.. రక్తం..చెమట నుంచి కట్టిన పన్నుల సొమ్మును దేశమంతా తిరిగి పంచుతున్నారన్నారు. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత చందంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారన్నారు.

అమరవీరుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతితో ఉందని.. కానీ బిహార్ లో పర్యటించి.. గాల్వాన్ లోయ అమరవీరుల కుటుంబాలకు పరిహారం అందజేతలో మాత్రం రాజకీయ ప్రయోజనం.. రాజ్యాధికార విస్తరణ కాంక్షే ఎక్కువగా కనిపించిందన్నారు.

నిజంగానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించటం తప్పేం కాదు. కానీ.. ముందు సొంత రాష్ట్రంలోని వారికి అందజేయాల్సిన అవసరం ఉంది.సీఎం కేసీఆర్ మర్చిపోయిన ఈ విషయాన్ని రేవంత్ తన తాజా వ్యాఖ్యలతో గుర్తు చేసే ప్రయత్నం చేశారని చెప్పాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.