Begin typing your search above and press return to search.

విద్యుత్ స్కాంపై వెనక్కి తగ్గనంటున్న ఫైర్ బ్రాండ్!

By:  Tupaki Desk   |   31 Aug 2019 12:10 PM GMT
విద్యుత్ స్కాంపై వెనక్కి తగ్గనంటున్న ఫైర్ బ్రాండ్!
X
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గడిచిన కొద్ది రోజులుగా విద్యుత్ శాఖపై విరుచుకుపడుతున్నారు. ఆ శాఖ సీఎండీ ప్రభాకర్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. భారీ అవినీతి చోటు చేసుకుందని.. ఇలాంటి వేళ.. సీఎండీని కాల్చి చంపినా తప్పు లేదన్న దారుణ వ్యాఖ్య చేశారు. రేవంత్ అంతే.. ఏదైనా విషయం మీద ఎవరూ ఊహించనంత తీవ్రతతో వ్యాఖ్యలు చేయటం.. విరుచుకుపడటం మామూలే. కాకుంటే.. తప్పు చేశారన్న ఆరోపణలతోనే చంపేసినా పాపం లేదన్న పెద్ద మాటలో అర్థం లేదన్న విషయాన్ని రేవంత్ మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.

ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలపై విద్యుత్ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే రేవంత్ పై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తమ సీఎండీని ఉద్దేశించి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే.. తాము చూస్తూ ఊరుకోమంటూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వ్యతిరేకతలోనూ తాను పట్టుకున్న ఇష్యూను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.

తాజాగా ఆయన మరోసారి విద్యుత్ శాఖలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు. విద్యుత్ శాఖలో వేల కోట్ల రూపాయిల మేర దోపిడీ చేస్తే ప్రశ్నించొద్దా? అని ప్రశ్నించిన రేవంత్.. తనకు వ్యతిరేకంగా ధర్నా చేసిన ఉద్యోగుల్ని ప్రోత్సహించిన వారెవరు? వారిపై ఎవరు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారు.. విద్యుత్ శాఖపై సీబీఐ విచారణ చేయాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా విమర్శలు చేశారని.. మరి సీబీఐ విచారణ ఏది? ఏమైందని ప్రశ్నించారు.

విద్యుత్ శాఖలో ఏదో జరిగిందంటూ గడిచిన కొద్ది రోజులుగా రేవంత్.. లక్ష్మణ్ లు అనుమానం వ్యక్తం చేయటమే కాదు.. భారీ కుంభకోణం జరిగినట్లుగా మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మీదా.. విద్యుత్ శాఖ మీదా.. బీజేపీ మీద హోల్ సేల్ గా విమర్శలు చేస్తున్న రేవంత్ తీరు చూస్తే.. ఇప్పట్లో ఆయనీ విషయాన్ని వదిలిపెట్టేలా లేనట్లే కనిపిస్తోంది.