Begin typing your search above and press return to search.

కేసీఆర్ అంటే కచరా.. నియంత

By:  Tupaki Desk   |   28 Jan 2018 5:16 PM GMT
కేసీఆర్ అంటే కచరా.. నియంత
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కు రోజుకో కొత్త పేరొస్తోంది. మొన్నటికి మొన్న గవర్నరు ఆయన్ను కాళేశ్వరం చంద్రశేఖరరావు అని పిలవగా... తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఇంకో పేరు పెట్టారు. అయితే, గవర్నరులా ఆయన ప్రశంసిస్తూ పేరు మార్చలేదు... కేసీఆర్ ను విమర్శిస్తూ నిక్ నేమ్ పెట్టారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న పేరుకు షార్ట్ ఫాంను తెలుగులో కచరా అని పెట్టారు. అంతేకాదు.. గవర్నరుకు ఆయన కాళేశ్వరం చంద్రశేఖర్ రావులా ఎందుకు కనిపిస్తున్నారో కానీ - తమకు మాత్రం కచరాలా కనిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ నేత - కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం జగిత్యాల జిల్లా మెట్‌ పల్లిలో ఎన్డీఎస్ ఎల్ కర్మాగారాల పునరుద్ధరణకు జరుగుతున్న రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్‌ తో రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం చెబుతోందని - కానీ అప్పులతో అల్లాడిపోతున్న రైతులను ఎలా ఆదుకుంటుందో చెప్పడం లేదన్నారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే.. క.చ.రా అంటూ రేవంత్ మండిపడ్డారు.

పనిలో పనిగా కేసీఆర్ ఇంటి మంత్రులు కేటీఆర్ - హరీశ్ రావులపైనా - కేసీఆర్ కుమార్తె ఎంపీ కవితపైనా ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్డీఎస్ ఎల్ కర్మాగారాలను నడిపించే శక్తి లేదా అని ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ పైనా రేవంత్ మండిపడ్డారు. గుడిబాట వీడి పొలంబాట పడితే క్షేత్ర స్థాయిలో సర్కారు పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు.

మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన కేసీఆర్ దురహంకారి అంటూ నియంతతో పోల్చారు. ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆరెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఖండిస్తున్నవారికి కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. రూ.500 కోట్లతో నిర్మించిన ప్రగతి భవన్ లో ఆయన ఎంజాయ్ చేస్తున్నారని.. ఆయన కుమారుడు - మంత్రి అయిన కేటీఆర్ విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ను తిరస్కరించడం ఖాయమన్నారు.