Begin typing your search above and press return to search.

రేవంత్ స‌వాలును కేసీఆర్ అండ్ కో విన్నారా?

By:  Tupaki Desk   |   5 Aug 2017 6:06 AM GMT
రేవంత్ స‌వాలును కేసీఆర్ అండ్ కో విన్నారా?
X
త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు వీలైనంత త్వ‌ర‌గా ఆ త‌ప్పును స‌రిదిద్దుకోవ‌టం మీద దృష్టి పెట్ట‌టం తెలివైన వారి ప‌ని. కానీ.. ఆ విష‌యాన్ని తెలంగాణ అధికార‌పక్షం మ‌ర్చిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. సిరిసిల్ల ఇసుక త‌ర‌లింపు వ్య‌వ‌హారం ర‌చ్చ ర‌చ్చ‌గా మార‌ట‌మే కాదు.. తెలంగాణ స‌ర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింద‌ని చెప్పాలి. త‌న‌పై వ‌చ్చే ఎలాంటి విమ‌ర్శను ఒప్పుకోని ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి నేత సైతం.. సిరిసిల్ల‌లో పోలీసులు చిన్న త‌ప్పు చేశారంటే.. వారెంత పెద్ద త‌ప్పు చేశారో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇసుక లారీలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళుతూ అమాయ‌కుల ప్రాణాల్ని తీస్తున్న వైనంతో నేరెళ్ల వాసులు తీవ్ర ఆగ్ర‌హానికి గురయ్యారు. దీంతో.. త‌మ ప్రాణాల్ని తీస్తున్న ఇసుక లారీల మీద త‌న ఆగ్ర‌హా జ్వాల‌ల్ని ప్ర‌ద‌ర్శించారు. దీంతో.. ఆందోళ‌నాకారుల‌పై పోలీసులు విరుచుకుప‌డ‌టం.. అదుపులోకి తీసుకొని త‌మ ప‌వ‌రేంటో చూపించిన వైనం గురించి బాధితులు గ‌ళం విప్ప‌టంతో జ‌నం బిత్త‌ర‌పోయే ప‌రిస్థితి.

నేరెళ్ల ఇష్యూ మీద ఆగ‌మాగం అవుతున్నా.. మంత్రి కేటీఆర్ చ‌ప్పుడు చేయ‌కుండా కామ్ గా ఉండ‌టం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేస్తోంది. ట్ర‌బుల్ షూట‌ర్ గా వ్య‌వ‌హ‌రించే కేటీఆర్ కామ్ గా ఉండ‌టం వెనుక కార‌ణం ఏమిట‌న్న‌ది ప‌లువురిని వేధిస్తోంది. ఇదిలా ఉంటే.. నేరెళ్ల ఇష్యూపై విప‌క్షాలు త‌మ నిర‌స‌న గ‌ళాన్ని మ‌రింత పెంచాయి. దీంతో.. త‌మ‌పై వెల్లువెత్తుతున్న‌ విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టేందుకు అధికార‌ప‌క్షం రివ‌ర్స్ గేర్ లో విరుచుకుప‌డ‌టం షురూ చేసింది. ఇలాంటి వేళ‌.. తెలంగాణ తెలుగుదేశం శాస‌న‌స‌భాప‌క్ష నేత రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర స‌వాలును విసిరారు.

సిరిసిల్ల ఇసుక మాఫియా బినామీలంతా సీఎం కేసీఆర్ బంధువులేన‌న్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌. ఒక‌వేళ తాను చేసిన ఆరోప‌ణ‌లు కానీ నిజం కాకుంటే త‌న‌ను 48 గంట‌ల వ్య‌వ‌ధిలో కేసులు పెట్టాల‌ని సివాలు విసిరారు. కేసీఆర్ బంధువులు రాజేంద‌ర్ రావు.. ప్ర‌వీణ్ రావు.. రంగారావు.. సంతోష్ రావుల‌కే ఇసుక కాంట్రాక్టులు ఇచ్చార‌న్నారు. ప్రాణం లేని ఇసుక లారీల‌కు ఉన్న విలువ మ‌నుషుల‌కు ఉండ‌దా? అంటూ రేవంత్ విరుచుకుప‌డ్డారు. తెలంగాణ విపక్షాలు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయంటూ మండిప‌డే కేసీఆర్ అండ్ కో రేవంత్ స‌వాలును స్వీక‌రిస్తే.. వారి విశ్వ‌స‌నీయత మ‌రింత పెర‌గ‌టం ఖాయం. మ‌రి..ఆ ప‌ని కేసీఆర్ అండ్ కో చేస్తారా?