Begin typing your search above and press return to search.

అందరికి పంచ్ లు వేసిన ఫైర్ బ్రాండ్.. కవిత మాట తేలేదు

By:  Tupaki Desk   |   19 Aug 2021 4:38 AM GMT
అందరికి పంచ్ లు వేసిన ఫైర్ బ్రాండ్.. కవిత మాట తేలేదు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేయాలన్నా.. టీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలు గుండెలు మండాలన్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాటలు వింటే చాలు. ఘాటైన పదాలతో విరుచుకుపడే రేవంత్ వ్యాఖ్యల జోరు.. గులాబీ దళంలో ఎప్పటికప్పుడు బీపీని పెంచేస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే తాజాగా నిర్వహించిన సభలోనూ ఆయన మాటలు సాగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాభమంతా కేసీఆర్ కుటుంబానికే జరిగింది తప్పించి.. ఇంకెవరికీ లేదన్న ఆయన మాటల్లో ఆసక్తికర అంశం ఒకటి చోటు చేసుకుంది.

ఒకసారి పంచ్ లు వేయటం షురూ చేస్తే.. నాన్ స్టాప్ గా విరుచుకుపడే రేవంత్.. తాజాగా రావిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కుటుంబం అన్నంతనే కొడుకు కేటీఆర్.. కుమార్తె కవిత.. మేనల్లుడు హరీశ్.. సడ్డుకుని కొడుకు సంతోష్ ను ఏకిపారేస్తుంటారు. తాజాగా ఆ పని చేసిన ఆయన.. కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావనను మాత్రం తీసుకురాలేదు.

తెలంగాణ వస్తే కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని.. ఆయన కొడుక్కి.. మేనల్లుడికి మంత్రి పదవులు వచ్చాయన్న కేసీఆర్.. సడ్డకుని కొడుక్కి రాజ్యసభ సభ్యుడిగా పదవి వచ్చిందన్నారు. ఇంతమంది గురించి మాట్లాడిన రేవంత్..కేసీఆర్ కుమార్తె కవితకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి గురించి మాత్రం మాట్లాడలేదు. తరచూ కేసీఆర్ కుటుంబం గురించి విమర్శలు చేసే వేళలో.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని హోల్ సేల్ గా విమర్శలు సంధించే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా కవిత మాటనే ప్రస్తావించకపోవటం ఆసక్తికరంగా మారింది.

ఎందుకిలా జరిగింది? అన్నదిప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు కేసీఆర్ వద్ద మేనల్లుడు హరీశ్ హవా నడుస్తుందని చెబుతున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత హరీశ్ ఫోటోను కూడా కొంతకాలం పాటు అధికారపార్టీకి చెందిన మీడియాలలో చూపించే వారు కాదని.. ఆయన ప్రస్తావన లేకుండా చూసుకునే వారని.. ఈటల ఎపిసోడ్ తర్వాత మాత్రం పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్లుగా చెబుతారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ దగ్గర హరీశ్ హవా ఎక్కువ నడుస్తుందని.. సంతోష్.. కవితలకు అంతంతమాత్రంగా ఉందంటున్నారు. కొడుకు కేటీఆర్ విషయంలో మాత్రం.. ఎప్పుడూ ఆయన రేంజ్ స్టేబుల్ గా ఉండటం.. అయితే గియితే గ్రాఫ్ పైకే తప్పించి కిందకు చూసే పరిస్థితి ఇప్పటివరకు కనిపించలేదన్న మాట టీఆర్ఎస్ ముఖ్యనేతల మాటల్లో వినిపించటం గమనార్హం. ఈ కారణంతోనే కవిత పేరును ఉద్దేశ పూర్వకంగానే రేవంత్ ప్రస్తావించలేదంటున్నారు.