Begin typing your search above and press return to search.

స్టార్ క్యాంపెయినర్ విజయశాంతా? రేవంత్ రెడ్డా?

By:  Tupaki Desk   |   7 Nov 2018 1:30 AM GMT
స్టార్ క్యాంపెయినర్ విజయశాంతా? రేవంత్ రెడ్డా?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఉన్న గిరాకీ చూస్తుంటే పార్టీ అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్‌ గా ప్రకటించిన విజయశాంతి కంటే రేవంతే స్టార్ క్యాంపెయినర్ అన్నట్లుగా కనిపిస్తోంది. మా నియోజకవర్గానికి రావాలంటే మా నియోజకవర్గానికి రావాలంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఆయన్ను పిలుస్తుండడం చూస్తుంటే రేవంత్‌ కు ఉన్న క్రేజేంటే అర్థమవుతోందని టీఆరెస్‌ నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. టీఆరెస్‌ ను - కేసీఆర్ ఫ్యామిలీని దుమ్ముదుల పాలంటే రేవంత్ రావాలంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. దీంతో ఏడాది కిందటే కాంగ్రెస్‌ లోకి వచ్చిన ఈ నేత ఇప్పుడు అక్కడ అందరినీ మించిపోయి బడా లీడర్‌ గా మారారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఏడాది పూర్తయింది. ఏడాది కిందట టీడీపీలో ఆయన మంచి పొజిషన్ లోనే ఉన్నారు. టిడిపిలో వర్కింగ్ ప్రసిడెంట్ గా - శాసనసభా పక్ష నేతగా రేవంత్ ఉండేవారు. ఆ పదవులకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్‌ లోకి వెళ్లాక రేవంత్ కూడా మిగతా నేతల మాదిరిగా కనుమరుగైపోతారని చాలామంది భావించారు. కానీ, ప్రస్తుతం సీను చూస్తుంటే రేవంత్ అక్కడ స్టార్ లీడర్‌ గా మారారు. కొందరు కాంగ్రెస్ సీనియర్లయితే రేవంత్ దూకుడును చూసి ముచ్చటపడుతున్నారట.. కొందరు మాత్రం ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఆయన్ను పట్టించుకోనట్లుగా నడిపిస్తున్నారు.

ఒకవైపు ఓటుకు నోటు కత్తి మెడలో వేలాడుతున్నా.. రేవంత్‌ ను ఎలాగైనా ఎక్కడైనా ఇరికించాలని టీఆరెస్‌ ప్రయత్నిస్తున్నా ఆయన మాత్రం భయపడకుండా టీఆరెస్‌ పై తన దాడి కొనసాగిస్తున్నారు. ఈ దూకుడే కొందరు కాంగ్రెస్ సీనియర్ లీడర్లకు నచ్చింది. ప్లెయిన్ లీడర్స్‌ గా పేరున్న కొందరు సీనియర్లు అందుకే రేవంత్‌ ను ఇష్టపడుతున్నారట. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగానే తొలుత ఆయనను పిలిచి సభ పెట్టిన నాయకుడు జిల్లెల చిన్నారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి చిన్నారెడ్డి. కమిట్ మెంట్ ఉన్న ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా చిన్నారెడ్డి పేరు తెచ్చుకున్నారు. అదృష్టం కలిసొస్తే సిఎం రేసులో ఉండే నాయకుడు చిన్నారెడ్డి. అటువంటీ చిన్నారెడ్డి తనకంటే వయసులో చిన్నవాడైన రేవంత్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి వనపర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ తర్వాత రేవంత్ పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో అమాంతం పెరిగిపోయింది. చిన్నారెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, జూనియర్ నేతలంతా మా నియోజకవర్గానికి రావాలంటే.. మా నియోజకవర్గానికి రావాలంటూ రేవంత్ ను కోరుతూ ఉన్నారు.

చిన్నారెడ్డి సభ ముగిసిందో లేదో మాజీ మంత్రి - సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు జె గీతారెడ్డి తన నియోజకవర్గంలో సభకు రేవంత్ ను జహీరాబాద్ కు ఆహ్వానించారు. కానీ రేవంత్ కు సమయం వెసులుబాటు కాకపోవడంతో ఆమె నిర్వహించిన సభకు వెళ్లలేకపోయారు. తర్వాత చాలా మంది నాయకులు రేవంత్ ను తమ నియోజకవర్గంలో పర్యటించాలంటూ విన్నపాలు చేస్తూనే ఉన్నారు. రేవంత్ ను ఆహ్వానించిన వారిలో మాజీ మంత్రులు చిన్నారెడ్డి - గీతారెడ్డి తర్వాత షబ్బీర్ అలీ - సునీతా లక్ష్మారెడ్డి - సుదర్శన్ రెడ్డి - సబితా ఇంద్రారెడ్డి - శ్రీధర్ బాబు - మాజీ ఎంపి మల్లు రవి లాంటి వారు ఉన్నారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి - శ్రీధర్ బాబు - గీతారెడ్డి నియోజవర్గాల్లో తప్ప మిగతా అందరి నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో రేవంత్ పాల్గొన్నారు.

మంచి మాస్ ఇమేజ్ ఉణ్న కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా రేవంత్ ను నల్లగొండకు ఆహ్వానించారు. గతంలో నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సమయంలో సంతాప సభకు రావాలని రేవంత్ ను కోమటిరెడ్డి ఆహ్వానించారు. అప్పుడు ఆ సంతాప సభకు వెళ్లిన రేవంత్ కేసిఆర్ పైనా - జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పైనా విరుచుకుపడ్డారు. అయితే, జానా - ఉత్తమ్ - మల్లు వంటి నేతలు మాత్రం రేవంత్‌ ను పెద్దగా ఎంకరేజ్ చేయడం లేదన్న వాదన ఒకటి వినిపిస్తోంది.