Begin typing your search above and press return to search.

రేవంత్ కు కాలిందట..

By:  Tupaki Desk   |   19 Oct 2015 10:23 AM GMT
రేవంత్ కు కాలిందట..
X
టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తమ పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై మండిపడుతున్నట్లు సమాచారం. తెలంగాణ టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినిచ్చి మంచి ప్రాధాన్యమిచ్చినా రేవంత్ కు ఎందుకంత మంట అనుకుంటున్నారా..? రేవంత్ కోపానికి కారణం అది కాదు. తనను, చంద్రబాబును ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువల నీరు తాగించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి చంద్రబాబు వెళ్లి ఆయన్ను ఏపీ రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించడం.. ఇద్దరూ రాసుకొనిపూసుకొని కనిపించడంతో రేవంత్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట.

పోనీ చంద్రబాబు మర్యాదపూర్వకంగా వెళ్లి కేసీఆర్ ను స్వయంగా పిలిచారని అనుకుని సరిబెట్టుకుందామన్నా పరిస్థితి అలా కనిపించలేదని రేవంత్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. గంట సేపు అక్కడే గడపడం... అందులోనూ 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడంపై రేవంత్ గరంగరంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ కారణంగా తాను కేసులు, కోర్టులతో తలనొప్పులు పడుతుంటే చంద్రబాబు ఏకంగా కేసీఆర్ ఇంటికెళ్లి దోస్తీ చేస్తున్నారని రేవంత్ ఫీలవుతున్నారట.