Begin typing your search above and press return to search.

టీడీపీ కొత్త ఆప‌రేష‌న్ అదిరింది

By:  Tupaki Desk   |   8 Jan 2016 10:12 AM GMT
టీడీపీ కొత్త ఆప‌రేష‌న్ అదిరింది
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ...రాజ‌కీయంగా క్రాస్‌ రోడ్స్‌ లో ఉన్న నాయ‌కుల స‌మూహం. ఒక‌వైపు తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న క్యాడ‌ర్‌ లో ధైర్యం నింప‌లేక...వ‌రుస‌బెట్టిన‌ట్లు పార్టీని వీడుతున్న నాయ‌కుల‌ను నిల‌బెట్టుకోలేక అవ‌స్థ‌లు ప‌డుతున్న నేత‌ల వేదిక‌! తెలుగుదేశం జాతీయ పార్టీగా ఆవిర్భ‌వించిన త‌ర్వాత బ‌ల‌ప‌డాల్సింది పోయి బ‌ల‌హీన‌ప‌డ‌టం ఆ పార్టీ అభిమానుల‌ను ఆవేద‌న‌కు గురిచేస్తోంది. అధికార టీఆర్ ఎస్‌ పార్టీ చేప‌డుతున్న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ను దీటుగా ఎదుర్కోవ‌డంలో తెలంగాణ టీడీపీ నేత‌లు వైఫ‌ల్యం చెందార‌నే చెప్ప‌వ‌చ్చు.

అయితే తాజాగా తెలుగుదేశం నాయ‌కులు తెలంగాణ‌లో పార్టీకి పూర్వవైభ‌వం తేవడానికి బ్ర‌హ్మండ‌మైన స్కెచ్‌ వేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో, ఇటీవ‌లి కాలంలో టీడీపీకి బైబై చెప్పిన తెలంగాణ‌ నాయ‌కుల‌ను సొంత‌గూటిలోకి ర‌ప్పించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. ఆప‌రేష‌న్ స్వ‌గృహా పేరుతో నాయ‌కుల‌ను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆపరేషన్ స్వగృహ పేరుతో... తెలుగుదేశం ని వీడి ఇతర పార్టీల్లో చేరిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రేవంత్ తెలిపారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు - టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ - రేవంత్‌ రెడ్డి సమక్షంలో గ్రేటర్ కాంగ్రెస్ నేత - మాజీ టీడీపీ నాయ‌కుడు కృష్ణప్రసాద్ తిరిగి టీడీపీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ అగ్ర‌నేత‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార టీఆర్ ఎస్ పైరవీకారుల పార్టీగా తయారైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్ష నేతలను కొనే స్కీమ్‌ ను తీసుకొచ్చారని ఆరోపించారు. ఇతర పార్టీల్లో పదవులు ఉంటేనే గౌరవమని, కానీ... టీడీపీలో ఉంటే చాలు గౌరవం దక్కుతుందన్నారు. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని, అనంతరం టీడీపీకి పూర్వవైభవం మొదలవుతుందని చెప్పారు.

తెలంగాణ టీడీపీ నేత‌లు ఆల‌స్యంగా అయినా మంచి ఆలోచ‌న చేశార‌ని, ముందు పార్టీని బ‌లోపేతం చేసిన త‌ర్వాత అధికార‌ప‌క్షంపై గ‌ట్టి ఎదురుదాడి చేయ‌వ‌చ్చ‌ని తెలుగుత‌మ్ముళ్లు అంటున్నారు. ఆప‌రేష‌న్ స్వ‌గృహా ఇందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ధీమాతో ఉన్నారు.