Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి... టీ పీసీసీకి దిక్కు ఈయనేనా?

By:  Tupaki Desk   |   18 July 2019 4:26 PM GMT
రేవంత్ రెడ్డి... టీ పీసీసీకి దిక్కు ఈయనేనా?
X
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్... తెలంగాణలో పడుతూ లేస్తోందే తప్పించి బలం పుంజుకున్న దాఖలా లేదు. ఇప్పుడున్న నాయకత్వాన్నే కొనసాగిస్తే... భవిష్యత్తులో బలం పుంజుకోవడం కూడా సాధ్యం కాదని తేలిపోయింది. ఈ మాట అంటున్నది ఇతరులెవరో కాదు.. స్వయంగా ఆ పార్టీ సీనియర్లే. మరి ఇప్పుడు నాయకత్వాన్ని మారిస్తే... కొత్తగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలి? ఇది కాంగ్రెస్ అధిష్ఠానం చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న విషయం. ఈ విషయంపై గత కొంత కాలంగా ఆలోచిస్తున్న అధిష్ఠానం ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం టీ పీసీసీ చీఫ్ గా ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్తగా మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన యువనేత రేవంత్ రెడ్డి నియమితులు కానున్నారట.

ఈ దిశగా అధిష్ఠానం నుంచి ఇప్పటిదాకా ప్రటకన రాకున్నా... నిర్ణయం మాత్రం జరిగిపోయిందన్న వాదన బలంగానే వినిపిస్తోంది. ఇందుకు చాలా కారణాలనే అధిష్ఠానం చెబుతున్నట్లుగా సమాచారం. ఉత్తమ్ దాదాపుగా ఐదేళ్ల బట్టి టీపీసీసీ చీఫ్ గా ఉంటున్నప్పటికీ పెద్దగా ఫలితం లేదన్నది కాంగ్రెస్ పెద్దల మాటగా తెలుస్తోంది. పార్టీని బాగానే నడుపుకుంటూ వస్తున్న ఉత్తమ్ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారట. అంతేకాకుండా పార్టీలోని నేతలను సమన్వయం చేసుకోవడంలోనూ ఆయన పెద్దగా సఫలం కాలేదట. మరోవైపు భవిష్యత్తు రాజకీయాల్లో కీలక భూమిక పోషించనున్న యువతను పార్టీ వైపు ఆకర్షించేలా చేయడంలోనూ ఉత్తమ్ సక్సెస్ కాలేదట.

మరి యువతను పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలంటే ఏం చేయాలి? ఇంకేం చేయాలి... యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతను టీపీసీసీ చీఫ్ గా నియమించాలి. అలాంటి నేత ఎవరున్నారు? అన్న కోణంలో ఆలోచించిన అధిష్ఠానానికి రేవంత్ ఒక్కరే కనిపిస్తున్నారట. ఇక మిగిలిన నేతల్లో ఏ ఒక్కరు కూడా ఈ అంచనాకు సమీపంలోకే రాలేకపోతున్నారట. దీంతో ఉత్తమ్ స్థానంలో రేవంత్ అయితేనే బాగుంటుందన్నది అధిష్ఠానం ఆలోచన అట. అయితే నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ కు టీపీసీసీ చీఫ్ లాంటి కీలక పదవి అప్పగిస్తే... చాలా కాలం నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్న నేతలతు ఊకురుంటారా? ఊరుకోక ఏం చేస్తారులే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిల ఉదంతాలు చూసిన తర్వాత... రేవంత్ పై ప్రకటన వెలువరించేలోగానే... పార్టీలో సీనియర్లుగా ఉన్న వి.హన్మంతరావు - జానారెడ్డి - అంజన్ కుమార్ యాదవ్ - మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాళ్లను కూల్ చేయాలి. ఆ బాద్యతను కూడా రేవంత్ కు అప్పగిస్తే ఎలా ఉంటుందని కూడా అధిష్ఠానం యోచిస్తోందట.

ఇదిలా ఉంటే... అధిష్టానం మదిలో ఈ భావన వచ్చేలా చేసేందుకు రేవంత్ కూడా చాలానే కష్టపడ్డారట. తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత ఏర్పడాలంటే... గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సాగించిన పాదయాత్ర మాదిరి ఓ సుదీర్ఘ యాత్ర అవసరమని - ఆ యాత్రను తానే చేస్తానని కూడా ప్రతిపాదించారట. ఈ సమయంలోనే ఈ యాత్రను పార్టీలో ఓ నేతగా కాకుండా టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ కొనసాగిస్తే ఎలా ఉంటుందని అధిష్ఠానం ఆలోచించిందట. ఈ ఆలోచన బాగానే ఉందని భావించిన అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పేరును ఖరారు చేసేసిందని, సరైన సమయం చూసుకుని ప్రకటన చేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.