Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్‌ గా రేవంత్

By:  Tupaki Desk   |   30 Oct 2017 5:24 AM GMT
కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్‌ గా రేవంత్
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వన్ మ్యాన్ ఆర్మీగా ఉంటూ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్న రేవంత్ రెడ్డి విషయంలో ఆ పార్టీ అధిష్ఠానం కూడా పక్కా వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్ చేరిక తెలుగు రాష్ఱ్టాల రాజకీయాల్లో కొత్త మార్పులకే కాకుండా జాతీయ స్థాయిలో కొత్త ఈక్వేషన్లకు సూచనగా భావించవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ టీడీపీని వీడిన సమయంలో ఆయన కానీ, టీడీపీ పెద్దలు కానీ, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు కానీ, క్యాడర్ కానీ స్పందించిన తీరు చూస్తుంటే దీర్ఘకాలిక ప్రణాళిక - కొత్త రాజకీయ వ్యూహాలు ఇందులో ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. చిరకాలంగా కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న తెలుగు దేశం పార్టీ తొలిసారి కాంగ్రెస్ తో కలిసేందుకు సుముఖంగా ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే చంద్రబాబు సూచనలు - వ్యూహాలు ప్రకారమే రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న వాదనా ఒకటి రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంతే అవుతారని అంటున్నారు.

ప్రస్తుతం బీజేపీతో టీడీపీ కలిసి సాగుతున్నప్పటికీ రెండు పార్టీల మధ్య ఏమంత సఖ్యత లేదు. తెలంగాణ - ఏపీల్లో రెండు పార్టీల నేతలు కొట్లాడుకుంటున్నారు. అటు మోడీ కూడా చాలాకాలంగా చంద్రబాబుకు ప్రయారిటీ ఇవ్వడం మానేశారు. మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమి ఉండదని ఇప్పటికే తేల్చేశారు. ఇక ఏపీలోనూ ఎన్నికల నాటికి ఏమవుతుందో తెలియని పరిస్థితి. 2014 ఎన్నికల తరువాత దేశంలో మరింత బలపడిన బీజేపీ 2019 ఎన్నికల్లో ఏపీలో తన మిత్రపక్షం టీడీపీని మరిన్ని సీట్లు అడగడం ఖాయం. అది చంద్రబాబు కూడా ఊహించనంత స్థాయిలో ఉంటుందని ఇప్పటికే బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 175 సీట్ల ప్రకారం చూసుకున్నా అందులో 60 సీట్లు తమకు కావాలని బీజేపీ డిమాండు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. చంద్రబాబు అందుకు ఒప్పుకోవడం కల. దేశంలో పెరిగిన బలాన్ని చూసి ఏపీలోనూ బలంగా ఉన్నామని భ్రమపడుతుతన్న బీజేపీ మెట్టు దిగడం కూడా కష్టమే. దాంతో పొత్తు అనుమానమే. మరోవైపు వైసీపీ - బీజేపీ సంబంధాలు కూడా రోజురోజుకీ బలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వైసీపీ - బీజేపీలు జట్టు కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి కూడా.

రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా రాజకీయ మార్గదర్శనం చేసే కీలక మీడియా సంస్థల్లో వచ్చిన మార్పులూ మారుతున్న రాజకీయ పరిణామాలకు సూచనగా కనిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో పాదయాత్ర ప్రారంభించనున్న జగన్ ఇప్పటికే ఆ మీడియా అధినేతను కలిసొచ్చారు. మొదటి నుంచి టీడీపీని, చంద్రబాబుకు భజన చేసే ఆ మీడియా సంస్థ కొంతకాలంగా రాష్ర్టంలోని చంద్రబాబు కంటే కేంద్రంలోని మోడీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. ఇప్పుడు మోడీ - బీజేపీ కేంద్ర పెద్దల సూచనతోనే తమకు ఒకప్పుడు బద్ధ విరోధి అయినప్పటికీ, వ్యాపార పరంగా పోటీదారు అయినప్పటికీ జగన్ కు సానుకూలంగా మారుతోంది. జగన్ పాదయాత్రకు మంచి కవరేజి ఇవ్వడానికి కూడా ఇప్పటికే నిర్ణయించుకుందట. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు - బీజేపీల మధ్య సంబంధాలు ఏ క్షణాన్నైనా తెగిపోవచ్చని అర్థమవుతోంది.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుపు అంత ఈజీ ఏమీ కాదు. అదేసమయంలో తెలంగాణలో తాను వెళ్లి చేసేదేమీ లేదు కాబట్టి తనతో పాటు ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ ను కాంగ్రెస్ లోకి పంపించి కథ నడిపించే పనికి చంద్రబాబు పూనుకొన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో మంచి క్రేజ్ ఉన్న నేత అయిన రేవంత్ దూసుకుపోగలరు కాబట్టి, కాంగ్రెస్ తో కలిసి ఆయన్ను జత చేసి కేసీఆర్ ప్రభకు గండి కొట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఫార్ములా సక్సెస్ అయితే, తెలంగాణలో రేవంత్ సీఎం అవుతారు, అప్పుడు చంద్రబాబు మళ్లీ హైదరాబాద్ లో కాస్త తలెత్తుకుని తిరగగలుగుతారు.