Begin typing your search above and press return to search.

రేవంత్‌ ముఖంలో కేసు టెన్షన్‌ కనిపించటం లేదంట

By:  Tupaki Desk   |   11 Jun 2015 9:24 AM GMT
రేవంత్‌ ముఖంలో కేసు టెన్షన్‌ కనిపించటం లేదంట
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే.. ఓటుకు నోటు వ్యవహారంలో వీడియో కంటికి చిక్కిన రేవంత్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్‌ లభించటం తెలిసిందే. కుమార్తె నిశ్చితార్థం నేపథ్యంలో ఆయనకు కోర్టు పన్నెండు గంటల బెయిల్‌ ఇచ్చింది.

చర్లపల్లి జైలు నుంచి ఇంటికి చేరుకున్న ఆయన.. తర్వాత వేడుక వేదిక అయిన ఎన్‌ కన్వెన్షన్‌కు బయలుదేరి వెళ్లారు. జైలు నుంచి తెల్లరంగు టీషర్ట్‌తో వచ్చిన ఆయన.. వేడుకకు బంగారు వర్ణంతో కూడిన గ్రాండ్‌ డ్రస్‌ వేసుకొని ధగధగలాడిపోయారు. వాస్తవానికి రేవంత్‌ దంపతులు చూసిన వారికి.. పెళ్లీడు వచ్చిన కుమార్తె ఉందని నమ్మేటట్లుగా లేకపోవటం విశేషం.

కేసు కష్టాల్లో ఉన్నప్పటికీ.. ఆ ఛాయలేవీ రేవంత్‌రెడ్డి ముఖంలో కనిపించలేదు. ఆయన నవ్వుతూ.. కార్యక్రమానికి వచ్చిన అందరిని సాదరంగా ఆహ్వానించారు. ఎవరితోనూ మాట్లాడకూడదు.. ఫోన్లో సంభాషణలు జరపకూడదంటూ కోర్టు షరతులు విధించటంతో ఆయన.. కార్యక్రమానికి వచ్చిన అతిధులతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. ఫోటోలకు ఫోజులిచ్చేంతవరకూ ఆయన పక్కన ఉండి రేవంత్‌ పక్కకు వెళ్లిపోయారు. టీడీపీ.. కాంగ్రెస్‌.. బీజేపీకి చెందిన నేతలు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్‌ ముఖంలో టెన్షన్‌ అస్సలు కనిపించటం లేదని.. హుషారుగా ఉండటాన్ని పలువురు తమ సంభాషణల్లో ప్రస్తావించుకోవటం కనిపించింది. మరోవైపు.. వేడుక జరుగుతున్న వేదిక మొత్తం ఏసీబీ అధికారుల కనుసన్నల్లో ఉంది.