Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కేడర్ కు రేవంత్ రెడ్డి స్వేచ్ఛనిచ్చాడా?

By:  Tupaki Desk   |   29 Aug 2021 5:03 AM GMT
కాంగ్రెస్ కేడర్ కు రేవంత్ రెడ్డి స్వేచ్ఛనిచ్చాడా?
X
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను నెరవేర్చిన ఘనత ఖచ్చితంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దీన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యింది. అందువల్ల వరుసగా రెండు సార్లు రాష్ట్రాన్ని ఇచ్చి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది.

ప్రతిపక్షంగా ఉన్న కూడా టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేకపోయింది. ఇక ఇదే అదునుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థి కాంగ్రెస్ ను చావుదెబ్బ తీశాడు. ఒకరి తర్వాత మరొకరిని కాంగ్రెస్ పెద్ద నాయకులందరినీ అధికార పార్టీలోకి లాగారు. టీకాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా నిస్తేజంగా మారేలా చేశాడు. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోవడం లేదని భావించి కాంగ్రెస్ హైకమాండ్ యువ నేత రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ను చేసింది. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనడం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభావం కాంగ్రెస్ క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. మునుపటిలా కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పై మాటల దాడి చేసినప్పుడు ప్రతీకారంగా కౌంటర్లు ఇచ్చేందుకు చాలా తక్కువమంది నాయకులు బయటకు వచ్చేవారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఒక మాటంటే బదులుగా మరో మాటను అంటూ కాంగ్రెస్ నేతలు తొడగొడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ గొంతులు ఈ మధ్య బిగ్గరగా లేస్తున్నాయి. కౌంటర్లకు ఎన్ కౌంటర్లు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి వివాదం తాజాగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఫైట్ కు ఉత్తమ ఉదాహరణగా చెప్పొచ్చు. మంత్రి మల్లారెడ్డి తాజాగా టీపీసీసీ చీఫ్ మల్లారెడ్డిపై దుర్భాషలాడిన వెంటనే కాంగ్రెస్ దళిత విభాగం ఏకంగా మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద నిరసనకు దిగింది. టీవీ చర్చల్లో... మరో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మంత్రి మల్లారెడ్డిపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

ఇక రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మంత్రి మల్లారెడ్డి భూఆక్రమణలపై సంచలన ఆధారాలతో సవాల్ చేశారు. ఆరోపనలతో బర్తరఫ్ చేసిన రాజయ్య, ఈటల రాజేందర్ లలాగనే మంత్రి మల్లారెడ్డిని కూడా కేసీఆర్ తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ను ఢిఫెన్స్ లోకి నెట్టడానికి ప్రయత్నించారు.

ఇప్పటికే మల్కాజిగిరిలో మంత్రి మల్లారెడ్డిని ఓడించానని.. గతఎన్నికల్లో ఎన్ని చేసినా ఆయన అల్లుడు తనపై గెలవలేదన్నారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ రాజీనామా చేసి గజ్వేల్ లో ఉప ఎన్నికలు పెట్టాలని.. తాను నిలబడుతా తేల్చుకుందాం అంటూ రేవంత్ సవాల్ చేశారు.

ఈ వివాదాల్లో ప్రజల దృష్టిని ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి విజయవంతం అయ్యారు. ఇది కాంగ్రెస్ క్యాడర్ క్రియాశీలకంగా మారడానికి దోహదపడింది. కాంగ్రెస్ కు తిరిగి కొత్త శక్తి రావడానికి కారణమైంది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో నూటికి నూరు మార్కులు సాధించాడు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇలాంటివి మరిన్ని జరుగవచ్చనని.. కాంగ్రెస్ కు ఖచ్చితంగా హైప్ లభిస్తుందని అంటున్నారు.