Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు రేవంత్ '100' ఛాలెంజ్!

By:  Tupaki Desk   |   6 Sep 2018 1:52 PM GMT
కేసీఆర్ కు రేవంత్ 100 ఛాలెంజ్!
X
ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఒంటికాలిపై లేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భం వ‌చ్చిన‌పుడ‌ల్లా కేసీఆర్ - కేటీఆర్ - హ‌రీష్ - క‌విత‌ల‌పై రేవంత్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పించేవారు. కేసీఆర్ కు ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన రేవంత్...ఓటుకునోటు కేసులో ఇరుక్కోవ‌డంతో అప్ప‌ట్లో కొద్దిగా దూకుడు త‌గ్గించాల్సి వ‌చ్చింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ మ‌ళ్లీ కేసీఆర్ అండ్ కో పై విరుచుకుప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా నేడు అసెంబ్లీ ర‌ద్దు చేయ‌డానికి ముందే రేవంత్....త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. కేసీఆర్ ది తుగ్ల‌క్ పాల‌న అని....జాత‌కాల పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరుకున్న కేసీఆర్ ఉన్న అసెంబ్లీలో ఉండ‌డం ఇష్టం లేకే రాజీనామా చేస్తున్నాన‌ని రేవంత్ అన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా కేసీఆర్ పై రేవంత్ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. 'రాసి పెట్టుకోండి... 100 స్థానాల్లో కేసీఆర్ ను ఓడిస్తాం' అంటూ రేవంత్ చాలెంజ్ చేశారు.

రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు 100 కు పైగా స్థానాలు ద‌క్కుతాయ‌ని ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా టీఆర్ ఎస్ ను 100 స్థానాల్లో ఓడిస్తామ‌ని - కావాలంటే రాసి పెట్టుకోవాల‌ని రేవంత్ చాలెంజ్ చేశారు. కేసీఆర్ క‌ల్ల‌బొల్లి మాటలను తెలంగాణ ప్రజలు న‌మ్మ‌డం లేద‌ని, కేసీఆర్ బలమైన వాదన‌కు వారు మద్దతివ్వరని చెప్పారు. భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ - కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణకు ప్రమాదం ఉందని భావించే అందరితో కలసి కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని చెప్పారు. బీజేపీ - ఎంఐఎం తప్ప ఏ పార్టీతోనైనా కలుసేందుకు సిద్ధ‌మ‌న్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెబుతారని - టీఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు. కాగా, కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి డీకే అరుణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ కు 10 స్థానాలు కూడా రావని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారని - హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌ని అరుణ విమర్శించారు.