Begin typing your search above and press return to search.

కేసీఆర్ దమ్ముకు పరీక్ష పెట్టేలా రేవంత్ సవాల్

By:  Tupaki Desk   |   12 July 2022 5:01 AM GMT
కేసీఆర్ దమ్ముకు పరీక్ష పెట్టేలా రేవంత్ సవాల్
X
మైకు పట్టుకున్న క్షణం నుంచి.. తానుఎవరినైతే టార్గెట్ చేశానో.. వారికి సంబంధించిన అవసరమైన.. అవసరం కాని విషయాల్ని సైతం అదే పనిగా ప్రస్తావిస్తూ.. వారిని 360 డిగ్రీల్లో తనదైన కోణంలో విరుచుకుపడటం.. వారిపై విపరీత వ్యాఖ్యలు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించినోళ్లు కనిపించరు.

అలాంటి మాటలకు సరైన రీతిలో సమాధానం చెప్పే సత్తా ఉన్న అతి కొద్ది మంది నేతల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరు. ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి.. ప్రధాని మోడీని.. కేంద్రంలోని ఆయన సర్కారుకు దమ్ముగా సవాలు విసిరటం.. ముందస్తుకు వస్తారా? అంటూ క్వశ్చన్ చేయటం తెలిసిందే.

మోడీ దమ్ము గురించి ప్రస్తావించి.. ప్రశ్నించిన కేసీఆర్ కు అనూహ్యమైన రీతిలో సవాళ్లు విసిరారు ఫైర్ బ్రాండ్ రేవంత్. "నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే.. దమ్ముంటే నాలుగు రోజుల్లోపు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తావా?" అంటూ సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో 90 లక్షల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రానుందన్న ఆయన.. ఒక్కఓటు తక్కువ వచ్చినా తన పేరు మార్చుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్.. రవిచంద్ర.. మస్తాన్.. రాష్ట్ర.. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇలా పలు సంస్థలతో సర్వేలు చేసి కేసీఆర్ కు ఇచ్చారన్నారు. వాటిని చూసిన కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. రాహుల్ వరంగల్ రైతు డిక్లరేషన్ సభ తర్వాత అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కు పాతిక సీట్లు మాత్రమే వస్తాయని.. మరో 17 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని పీకే సర్వే రిపోర్టు స్పష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ కు 32 స్థానాల్లో గెలుస్తుందని.. మరో 23 సీట్లలో పోటాపోటీ ఉంటుందన్నారు. బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది స్థానాల్ని సొంతం చేసుకోవటంతో పాటు.. మరో ఎనిమిది స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుందన్నారు. మజ్లిస్ పార్టీ ఐదు నుంచి ఏడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్నారు.

ఈ రిపోర్టు ఒక్క పీకే మాత్రమే కాదు.. అన్ని సర్వే రిపోర్టుల సారాంశాలు ఇలానే ఉన్నట్లు చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభ తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ మూడు శాతం పెరిగినట్లు చెప్పిన రేవంత్.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందన్న విషయం నివేదికల్లో స్పష్టమైందన్నారు. అందుకే మోడీ.. కేసీఆర్ లు ఇద్దరు ఒకరిని ఒకరు గోక్కునే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మరి.. మోడీ దమ్ము గురించి మాట్లాడి సవాల్ విసిరిన కేసీఆర్.. తాజాగా అదే దమ్మును గుర్తు చేసిన రేవంత్ గులాబీ బాస్ ను ప్రశ్నిస్తూ.. విసిరిన సవాల్ కు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.